తాడేపల్లి: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను కప్పిపుచ్చేందుకే కూటమి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆరోపించారు. విజయవాడలో పోలీసుల వేధింపుల నేపథ్యంలో మాదిగ యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు మౌనం పాటించిన టీడీపీ నేతలు, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల పేరును ఉపయోగిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పదే పదే మాదిగ పౌరుషం గురించి మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. క్రాంతికుమార్ మరణం, దళితులపై జరుగుతున్న అన్యాయాలు, దాడుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో కొమ్మూరి కనకారావు ఏమన్నారంటే.. - డైవర్షన్ రాజకీయాలే కూటమి ప్రభుత్వ అజెండా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్ రాజకీయాలనే నమ్ముకుంది. విజయవాడలో లాకప్ డెత్, శవం మాయం, పోలీసు వేధింపులకు మాదిగ యువకుడు క్రాంతికుమార్ బలైన ఘటనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారు. అదే క్రమంలో అనంతపురంలో కూడా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపి దళిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ముందుకు తెచ్చారు. - పదే పదే కులం పేరు తీసుకురావడం సమాజానికి మంచిది కాదు వైయస్ఆర్‌సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై ఇటీవల టిప్పర్‌తో జరిగిన హత్యాయత్నం ఘటనలో వాస్తవాలు వెలికితీయాల్సిన ప్రభుత్వం, ఆ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పదే పదే కులం పేరుతో రాజకీయాలు చేయడం సమాజానికి మంచిది కాదు. నిజంగా మాదిగ సమాజంపై చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో పోలీసు వేధింపులతో ప్రాణాలు కోల్పోయిన మాదిగ యువకుడు క్రాంతికుమార్ విషయంలో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?. - ఎంఎస్ రాజు... ప్రశ్నించాల్సింది తోపుదుర్తిని కాదు, చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నించాల్సింది వైయస్ఆర్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని కాదు, చంద్రబాబు నాయుడిని. దళిత సంక్షేమ పథకాల అమలు, ఎస్సీ కార్పొరేషన్ల పరిస్థితి, దళితులపై జరుగుతున్న దాడులు, క్రాంతికుమార్ వంటి ఘటనలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంఎస్ రాజుకు సూచించారు. మంత్రి పదవుల కోసం కుల రాజకీయాలు చేయడం దళిత సమాజం అంగీకరించదన్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఆ పోరాటంలో వైయస్ఆర్‌సీపీ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి అండగా ఉంటుందని కొమ్మూరి కనకారావు స్పష్టం చేశారు.