తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తోంది రాజ్యాంగబద్ధమైన 'రూల్ ఆఫ్ లా' కాదని.. చంద్రబాబు, లోకేష్‌లు రుద్దిన 'రూల్ ఆఫ్ ఫియర్' అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ చేతగానితనం వల్ల రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్‌గా మారిందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల స్వర్ణయుగ పాలనలో విద్యా, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం సాధించిన కేంద్ర అవార్డులను గుర్తుచేసిన ఆమె, ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ తెచ్చిన 'రెడ్ బుక్ రాజ్యాంగం'తో అక్రమ కేసులు, లాకప్ డెత్‌లు పెరిగిపోయాయని.. వైయస్.జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తూ తండ్రీకొడుకులు కమిషన్ల దందాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో 'మౌన విప్లవం' మొదలైందని, త్వరలోనే ఈ దుష్ట పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - అంధకారంలో ఆంధ్రప్రదేశ్ – అన్ని వర్గాల్లోనూ రోదనలు.. రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా బాధ, దుఃఖం, ఏడుపులే కనిపిస్తున్నాయి. రైతులు రోడ్ల మీదకు వచ్చి పంటలు పారబోసి ఏడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల పొట్ట గొడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి సహకరించిన ఉద్యోగులు సైతం ఈరోజు రోడ్డున పడి బాధపడుతున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని, తానే సెల్ ఫోన్ కనిపెట్టానని కోతలు కోసే చంద్రబాబును నమ్మి ప్రజలు ఘోరంగా మోసపోయారు. - వైయస్. జగన్ పరిపాలన ఒక 'స్వర్ణయుగం'.. వైఎస్ జగన్ 5 ఏళ్ల పరిపాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణయుగం. దీనికి కేంద్ర అవార్డులే నిదర్శనం. పేద వర్గాల సంక్షేమం కోసం వైయస్. జగన్ తీసుకున్న అద్భుత నిర్ణయాల వల్ల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుండి ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే హోంశాఖ నుండి ఏపీ పోలీసు వ్యవస్థకు 6-7 సార్లు అవార్డులు దక్కాయి. విద్యారంగంలో సైతం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 'నాడు-నేడు' ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, ఇంగ్లీష్ విద్యను అందుబాటులోకి తెచ్చి, పేద విద్యార్థులను ఐక్యరాజ్యసమితి (UN) వేదికపై ధారాళంగా మాట్లాడించిన ఘనత.. విజనరీ లీడర్ వైయస్. జగన్ కే దక్కుతుంది. - పోలీస్ స్టేషన్లు అక్రమాలకు అడ్డాలు – 'రెడ్ బుక్' రాజ్యాంగం.. నేడు ఏపీలో రూల్ ఆఫ్ లా కాకుండా 'రూల్ ఆఫ్ ఫియర్' (భయానక పాలన) నడుస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థను టీడీపీ, జనసేన కూటమి తమ జేబు సంస్థగా మార్చుకుంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లింది. ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్టులపై ఉపా (UPA) చట్టాల క్రింద అక్రమ కేసులు పెడుతున్నారు. రూముల్లో నక్సల్స్ పుస్తకాలు, ఆయుధాలు పడేసి జైళ్లకు పంపే దారుణ సంస్కృతిని తెచ్చారు. లోకేష్ తెచ్చిన 'రెడ్ బుక్' రాజ్యాంగం వల్ల రాష్ట్రంలో లాకప్ డెత్‌లు, హత్యలు పెరిగిపోయాయని.. సాయి కృష్ణ, మాల గంగమ్మ, తిరుపతిమ్మ, కళావతి, క్రాంతి కుమార్ ల మరణాలే దీనికి నిదర్శనం. నా కొడుకు బూడిదైనా ఇవ్వండి. కనీసం ఆ బూడిద తీసుకెళ్లి మేము కర్మ క్రియలు చేసుకుంటాం అని వేడుకుంటున్న సాయికృష్ణ తల్లి కన్నీటికి అంతం లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి ఆమె కన్నీరు బొట్టు ఒక్కటి చాలు. - చంద్రబాబు చరిత్రే ఒక 'రాక్షస పాలన'.. కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ దొంగిలించేందుకే చంద్రబాబు మళ్లీ శంకుస్థాపనల డ్రామాలు ఆడుతున్నారు. వైయస్.జగన్ భారీగా నిధులిచ్చి, భూములు సేకరించి జిందాల్ సంస్థకు అప్పగించారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో ఒకరు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటూ దొంగల కంటే హీనంగా ప్రవర్తిస్తోంది. స్వయంగా జిందాల్ సంస్థ స్టేట్మెంట్ ఇచ్చాక చంద్రబాబు చేస్తున్న క్రెడిట్ చోరీ ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. 1995లో సొంత మామ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2004 వరకు సాగిన ఆయన పాలన ఒక రాక్షస పాలన, ఆల్విన్ లాంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలను అమ్మేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాలనలోనే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించి చంపించారు. వరల్డ్ బ్యాంక్ అమ్ముడుపోయిన జీతగాడని కమ్యూనిస్టులు ఆయనపై పుస్తకాలు వేశారు. ఎప్పుడూ అడ్డదారిలోనే వాజ్ పేయి, మోడీల కాళ్లు పట్టుకుని అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటు. - ప్రైవేటీకరణ పేరిట కమిషన్ల దందా – భారీ అవినీతి.. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి, మంచి పని చేసిన చరిత్ర లేదు. గతంలో కూడా చంద్రబాబు చక్కెర ఫ్యాక్టరీలను, పాల డెయిరీలను అడ్డగోలుగా ప్రైవేటుకు కట్టబెట్టారు. తన సొంత సంస్థ 'హెరిటేజ్' ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇటువంటి స్వార్థపూరిత పరిపాలన సాగిస్తున్నారు. వైయస్.జగన్ రాష్ట్రం కోసం నిర్మించిన ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తూ కమిషన్లు నొక్కుతున్నారు. రామాయపట్నం పోర్టు, 17 మెడికల్ కాలేజీలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. దోచుకున్న లక్షల కోట్ల బ్లాక్ మనీని దాచుకోవడానికి అమెరికా, సింగపూర్, మారిషస్, దుబాయ్, ఇండోనేషియా, చైనాలలో చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు. చంద్రబాబు, లోకేష్‌లు దావోస్ వెళ్లడం కేవలం ఎంజాయ్ చేయడానికే తప్ప రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు శూన్యం. - పవన్ కళ్యాణ్ అరాచకాలకు మద్దతుదారుడు... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బీహార్ కంటే దారుణంగా తయారైంది. నేరం చేసిన వారిని వదిలేస్తూ బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 'రావణ్' అనే అబ్బాయిని హైదరాబాద్ నుండి పట్టుకొచ్చి అక్రమంగా వేధించడం దారుణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు తీవ్రఆక్షేపణీయం. పవన్ కళ్యాణ్ మీద ఎంతో మంది ఆశలు పెట్టుకుంటే ఆయన మాత్రం చంద్రబాబు కంటే ఘోరంగా తయారయ్యాడు. తనను ఇమిటేట్ చేస్తూ మాట్లాడినందుకు 'రావణ్' అనే సోషల్ మీడియా కార్యకర్తను హైదరాబాద్ నుండి పట్టుకొచ్చి అక్రమ సెక్షన్లతో వేధిస్తున్నారు. ఇది రాక్షస పాలన కాదా? నేరం చేసిన టీడీపీ నేతలు పెళ్లికొడుకుల్లా తిరుగుతుంటే, బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారు. వృద్ధ దంపతుల భూములు, చివరికి స్మశానాలను కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగుతున్న దుష్ట పరిపాలనను చూసి జనం తెగ ఏడుస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజల్లో ఒక 'మౌన విప్లవం' రేగుతోందని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. ఈ సందర్భంగా కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చెప్పిన పద్యం "కర్కస కరాళ కారు మేఘాల నీడలు ఎగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు..." ను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో కారుచీకట్లు కమ్ముకున్నాయని ఆవేదన చెందారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని, ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్‌లు ఎదుర్కోబోయే కష్టాలను కూడా ఊహించుకోవచ్చని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.