గుంటూరు: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్ర జరుగుతోందని, సోషల్ మీడియా యాక్టివిస్టులపై చట్టవ్యతిరేకంగా దౌర్జన్యకాండ కొనసాగుతోందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్యాయంగా, అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచి న్యాయపరమైన పోరాటం చేస్తుందని గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ప్రకటించారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: అక్రమ కేసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ: సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ మా పార్టీకి చెందిన వారు కాకపోయినా.. వారిపై వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి తప్ప, కేసుల మీద కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. న్యాయవ్యవస్థకే సవాల్: ప్రశ్న రావణ్‌కు పలుమార్లు బెయిల్ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన యూఏపీఏ (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్)ను ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం న్యాయవ్యవస్థకే సవాల్. మా పార్టీతో సంబంధం లేకపోయినా అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ వేధింపుల కోసం చట్టాలను దుర్వినియోగం చేయడం సరికాదు. అన్యాయంపై వైయస్ఆర్‌సీపీ పోరాటం: బాధితులనే నిందితులుగా మార్చే ఈ ధోరణిని వైయస్ఆర్‌సీపీ సహించదు. అందుకే ఎవరికి అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా వారి తరపున పోరాడతాం. జనవరి 31న నా ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేస్తాను. ఈ దుర్మార్గమైన పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కాగా, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రతి చర్యను ప్రజల తరపున వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని అంబటి రాంబాబు చెప్పారు.