28న నిర‌స‌న ర్యాలీ విజ‌య‌వంతం కావాలి

విద్యార్థులు, యువ‌తతో భారీగా నిర్వ‌హించాలి

డీఎస్సీ బాధిత అభ్య‌ర్థుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాలి

ప్ర‌తి ఒక్క‌ర్నీ ప్రభావితం చేసేలా సోష‌ల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దిశా నిర్దేశం

పార్టీ విద్యార్థి, యువ‌జ‌న విభాగ నాయ‌కుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్  

తాడేప‌ల్లి: విద్యార్థి, యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ఈనెల 28న వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన నిర‌స‌న ర్యాలీ కార్యక్రమంపై పక్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులకు పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేశారు. టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా పార్టీ విద్యార్థి, యువ‌జ‌న విభాగ నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన ఆయ‌న‌, దేశవ్యాప్తంగా నీట్ అక్రమాలపై జరిగిన ఆందోళనలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలో డీఎస్సీ భర్తీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డీఎస్సీ నియామ‌కంలో స్పోర్ట్స్ కోటా కింద చెల్లుబాటు కాని సర్టిఫికెట్లతో దాదాపు 400 పోస్టులు కేటాయించడం, ఎగ్జామినర్, కన్వీనర్ బాధ్యతలను ఒకే వ్యక్తికి ఇచ్చి, ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగితో నడిపించి అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలతో పాటు రూ. 10వేల కోట్లకు పైగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగుల‌కు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకపోవడంపై నిరసన గళం విప్పాలని చెప్పారు. పార్టీ శ్రేణులతో పాటు తటస్థ విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన సంఘాలను కలుపుకొని ప్రతి జిల్లాలో వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆదివారం రోజే విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, కాలేజీలలో చిన్న చిన్న గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించి, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా నిరసన పిలుపును విస్తృతంగా ప్రచారం చేయాలని, వీడియోల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించేలా చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలలో పోస్టర్ ఆవిష్కరణలు పూర్తి చేసి, డీఎస్సీ అభ్యర్థులను నేరుగా సంప్రదించి ఈ ర్యాలీల్లో భాగస్వాములను చేయాలని కోరారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాకు ఢిల్లీలో సీజేపీ నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాల‌ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. నిరసన కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా సోషల్ మీడియాను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్లు అదీప్ రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతోపాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌విచంద్ర, తోట రామ్‌జీ, హర్షిత్ రెడ్డి త‌దిత‌రులు ఈ టెలీకాన్ఫ‌రెన్సులో పాల్గొన్నారు.

Back to Top