డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేస్తారా?

 లేక కొడుకు పదవిని చంద్రబాబు కాపాడుకుంటారా? 
 
ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జగన్‌ సూటి ప్రశ్న 

తాడేప‌ల్లి: డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పాతర వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? అని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

డీఎస్సీ వ్యవహారంపై ఆయన సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.

అదే ప్రమాణాలు ఏపీలో వర్తించవా?

కేంద్రంలో పాటించిన నైతిక ప్రమాణాలనే ఆంధ్రప్రదేశ్‌లోనూ పాటిస్తారా? అని వైయ‌స్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.

ఈ పరిణామాలకు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ నైతిక బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌కు ఆ ప్రమాణాలు వర్తించవా? అనే ప్రశ్నను సంధించారు.

లోకేష్‌ పదవా?.. ఎన్డీఏ విలువలా? 

డీఎస్సీ పరీక్షపై లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని, పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేక ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకునే విలువలు, ప్రమాణాలను పక్కనపెట్టి సీఎం చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? అని నిలదీశారు.  

Back to Top