నారా లోకేష్ త‌క్ష‌ణం రాజీనామా చేయాలి

ద‌గా డీఎస్సీపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పించాలి

ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ 

నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి 

మెగా డీఎస్సీ పేరుతో 4 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌తో ప్ర‌భుత్వం ఆట‌లు

పేప‌ర్ త‌యారీ నుంచి నియామ‌కాల వ‌ర‌కు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌లు

ఉద్దేశ‌పూర్వ‌కంగా అడుగ‌డుగునా అవ‌క‌త‌వ‌క‌లు, జీవోల మార్పు 

స్పోర్ట్స్ డీఎస్సీ పేరుతో భారీగా అవినీతి, అర్హుల ఆశ‌ల‌కు గండి

ప్ర‌శ్నాప‌త్రం త‌యారీలోనే త‌ప్పుడు ప్ర‌శ్న‌లు, నార్మ‌లైజేష‌న్ పైనా అనుమానాలు 

స్పోర్ట్స్ స‌ర్టిపికెట్లు, బ్యాక‌ప్ స‌ర్టిఫికెట్లతో త‌మ వారికి ఉద్యోగాలు

టెట్ క్వాలిఫై కాకుండానే చాలా మందికి ఉద్యోగాలు 

డీఎస్సీ అక్ర‌మాల‌పై విరుచుకుప‌డిన ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి 

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, దానికి బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ త‌క్ష‌ణం రాజీనామా చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలోనూ ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిబంధనలు ఉల్లంఘన జ‌రిగింద‌ని, గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా విద్యాశాఖలో భారీ అవినీతి జరిగింద‌ని ఆరోపించారు. మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్రంలో అంతకంటే దారుణమైన అక్రమాలు జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే... 

- 4 ల‌క్ష‌ల విద్యార్థుల జీవితాల‌తో ఆట‌లు 

ఢిల్లీలో 'నీట్' ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై నిరసనలు వ్యక్తమవ్వడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో 4 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ, డీఎస్సీలో ఇన్ని అక్రమాలు జరిగినా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయడం లేదు? డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ మొదటి నుంచీ పారదర్శకమైన సీబీఐ విచారణ కోరుతోంది. తప్పు చేయనప్పుడు ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు ముందుకు రావడం లేదు? తప్పులు బయటపడతాయనే భయంతోనే స్పందించడం లేదు. అక్రమాలను ప్రశ్నిస్తున్న అభ్యర్థులు, ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ, సామాజిక మాధ్యమాల్లో ఉపాధ్యాయులతో ట్రోల్ చేయిస్తూ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తోంది.

- ప్రశ్నపత్రం త‌యారీ మొద‌లుకొని... 

డీఎస్సీ ప్రశ్నపత్రాలను తయారు చేసిన ఎస్సీఈఆర్టీ సంస్థలో నవీన్ అనే వ్యక్తి అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సుమారు 30 వేల ప్రశ్నలను టైప్ చేసే విభాగంలో పనిచేసిన ఈ నవీన్ అనే ఉద్యోగికి డీఎస్సీ సోషల్ స్టడీస్‌లో రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్, టీజీటీ లో 6వ ర్యాంక్ వచ్చాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, డీఎస్సీ కన్వీనర్ ఒకరే (కృష్ణా రెడ్డి) కావడం, టైపింగ్ సెక్షన్‌లో ఉన్న నవీన్ ద్వారా క్వశ్చన్ పేపర్లు బయటకు లీక్ అయ్యాయనడానికి ఇది స్పష్టమైన ఆధారం.

- తప్పుడు ప్రశ్నలు, నార్మలైజేషన్ దోపిడీ

పరీక్షలలో ఏకంగా 17 తప్పుడు ప్రశ్నలు ఇచ్చారు. ఒకే ప్రశ్నకు మ‌ల్టిపుల్ ఆన్స‌ర్స్ ఇచ్చి గందరగోళం సృష్టించారు.
నార్మలైజేషన్ ప్రక్రియ పేరుతో నిర్దిష్ట సెషన్లలో తమకు కావలసిన వారికి ఇష్టారాజ్యంగా 6 మార్కుల వరకు కలిపారు. 0.1 మార్కు తేడాతో వేలాది మంది నిజమైన ప్రతిభావంతులు ఉద్యోగాలు కోల్పోయారు.

- సెలక్షన్ లిస్ట్ ధిక్కరణ, హారిజాంటల్ రిజర్వేషన్:

దేశంలో ఏ నియామక ప్రక్రియలోనైనా ముందుగా మెరిట్ లేదా సెలెక్షన్ లిస్ట్ ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. కానీ ఇక్కడ ముందుగానే తమ వారికి ఉద్యోగాలు ఇచ్చేసి, ఆ తర్వాత సెలెక్షన్ లిస్ట్ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనలను తలకిందులుగా అమలు చేసి అర్హులైన అభ్యర్థులకు మొండిచేయి చూపారు.

- స్పోర్ట్స్ డీఎస్సీ పేరుతో మహా కుంభకోణం

నిబంధనల ప్రకారం హ‌య్యస్ట్ అచీవ్‌మెంట్ సర్టిఫికెట్‌కు సరిపోయే బ్యాకప్ సర్టిఫికెట్ ఉండాలి. కానీ, ఒకరికి హ‌య్య‌స్ట్ సర్టిఫికెట్ వాలీబాల్ ది ఉంటే, బ్యాకప్ కబడ్డీది పెట్టారు. మరొకరికి 2012లో హ‌య్య‌స్ట్ సర్టిఫికెట్ ఉంటే, బ్యాకప్ సర్టిఫికెట్ 2013 నాటిది పెట్టారు. బ్యాకప్ సర్టిఫికెట్ లేదని శంకర్ గోపాల్ అనే జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని రిజెక్ట్ చేశారు. కానీ, అధికార పార్టీ రికమండేషన్ ఉన్న అభ్యర్థులకు బ్యాకప్ లేకపోయినా శాప్ ద్వారా లెటర్లు తెప్పించి ఉద్యోగాలు కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం సెక్రటరీ మాత్రమే పెట్టాలి, కానీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కూన ర‌వికుమార్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సర్టిఫికెట్లపై సంతకాలు పెట్టారు. ఈ చెల్లుబాటు కాని సంతకాలతో సుమారు 17 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. స్కూల్‌, జూనియర్ లెవెల్ గేమ్స్ పరిగణించకూడదనే నియమం ఉన్నా, కొందరికి ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు. 12 మందికి సంబంధించి తాము తప్పులు చేశామని శాప్ స్వయంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసినా వాటిని సరిదిద్దలేదు. మామిడాల శివకృష్ణ అనే 72 పాయింట్లు వచ్చిన అర్హుడికి పోస్ట్ ఉందని చూడక‌పోవ‌డం వ‌ల్ల‌ ఉద్యోగం నిరాకరించారు.

- టెట్ నిబంధనల ఉల్లంఘన, జీవోల ఉపసంహరణ

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగానికి 'టెట్' క్వాలిఫై కావడం తప్పనిసరి. కానీ, కనీసం టెట్ రాయని వారికి, 2025 టెట్‌లో డిస్క్వాలిఫై అయిన వారికి కూడా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. డీఎస్సీ, టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేలా తీసుకొచ్చిన రెండు వివాదాస్పద జీవోలను, తమ వారికి పోస్టింగులు ఇచ్చుకున్న వెంటనే రాత్రికి రాత్రే ఉపసంహరించుకోవడం ఈ ప్రభుత్వ కుట్రకు నిదర్శనం.

- సీబీఐ విచారణపై హైకోర్టులో పిటిషన్  

మేము ఈ అక్రమాలన్నింటిపై ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. డాక్యుమెంట్లు క్రమపద్ధతిలో లేవనే ఒక చిన్న సాంకేతిక కారణంతో, కోర్టు అనుమతితోనే పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నాం. మళ్లీ సోమ లేదా మంగళవారాల్లో సరైన ఆర్డర్‌లో పిటిషన్ దాఖలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం పిటిషన్ డిస్మిస్ అయ్యిందని అసత్య ప్రచారాలు చేస్తోంది. గతంలో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూస్తే వైఎస్సార్‌సీపీ పోరాటం వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తల్లికి వందనం నిధులపై నిలదీస్తేనే ప‌థ‌కానికి అరకొరగా అయినా నిధులు ఇచ్చారు. అదే రీతిలో, ఈ 'దగా డీఎస్సీ'పై సీబీఐ విచారణ జరిపించే వరకు, లోకేష్ రాజీనామా చేసే వరకు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడతాం" అని ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top