డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్.

తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్.

 తాడేపల్లి :కూటమి ప్రభుత్వం నిర్వహించిన డియస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం డియస్సీ నిర్వహణలో నిబంధనలను పక్కనబెట్టి, గోప్యతను దెబ్బతీస్తూ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో నీట్  వ్యవహారంలో అనుసరించిన తీరుగానే, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేసి, డియస్సీ స్కామ్‌పై స్వతంత్ర సంస్థ అయిన సిబిఐ తో పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. 

- డిఎస్సి నిర్వహణలో గోప్యత, పారదర్శకత శూన్యం...

వైయస్. జగన్ హయాంలో మేము విద్యాశాఖను నడిపిన తీరుకు, నేటి కూటమి ప్రభుత్వ విధానాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ డియస్సీ  వ్యవహారంలో కాన్ఫిడెన్షియాలిటీ (గోప్యత), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ న్యూట్రాలిటీ అసలు ఎక్కడా కనపడలేదు. ప్రశ్నాపత్రం తయారు చేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ రెండూ వేర్వేరుగా ఉండాలి. కానీ, ఈ రెండింటినీ కలిపేయడం వల్ల గోప్యత పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైతే ప్రశ్నపత్రాలు అప్‌లోడ్ చేసిన వారికే ఫస్ట్ ర్యాంకులు రావడం దేనికి సంకేతం?
 
- డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలి - లోకేష్ స్పందించాలి..

డియస్సీ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు ఇంతవరకు ఈ డియస్సీ ఎగ్జామ్ మీద వచ్చిన ఆరోపణలపై ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అధికారులను పిలిపించి ఏదో ఒక సమాధానం చెప్పించి, 'ఇంతటితో క్లోజ్ చేయండి' అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర శాఖలన్నింటిలో తలదూర్చి 'సకల శాఖల మంత్రి' అనిపించుకుంటున్న లోకేష్, తన స్వంత శాఖలో జరిగిన ఈ స్కామ్‌పై ఎందుకు నోరు మెదపరు?
 
- గవర్నర్ దృష్టికి వందల ఆధారాలు, కేసులు..

డియస్సీ వ్యవహారంలో అన్ని ఆధారాలు, సాక్షాలు, వీడియో టేపులతో సహా పోస్టులను ఎలా అమ్ముకుంటున్నారో చూపించే ఆధారాలను మేము గౌరవ గవర్నర్ గారి ముందు ఉంచాం.  డియస్సీ అవకతవకలపై ఇప్పటికే కోర్టులో సుమారు 300 నుంచి 400 కేసులు ఫైల్ అయి ఉన్నాయని గవర్నర్ గారే స్వయంగా చెప్పారు. ఇన్ని కేసులు ఉన్నందున ఇది న్యాయపరమైన అంశమనిఆయన పేర్కొన్నారు. డియస్సీలో అవకతవతలకు పాల్పడ్డం ద్వారా సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల త్యాగాలను ఈ కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. తమకు నచ్చిన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేంత వరకు గేట్లు ఎత్తి, ఆ తర్వాత క్లోజ్ చేశారు.
 
- జీవోలతో స్పోర్ట్స్ కోటాలో బ్లేటెంట్ ఫ్రాడ్..

చరిత్రలో మొట్టమొదటిసారిగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా డియస్సీ  ప్రవేశ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, ఆ సర్టిఫికెట్ల  వాలిడిటీ, ఆథెంటిసిటీ కూడా వెరిఫై చేయకుండా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్లు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు కల్పించారు. ఆ తర్వాత ఆ జీవోలు కనపడకుండా చేసి, మళ్లీ జీవో నెంబర్ 56 ద్వారా నిబంధనలు మార్చారు. ఇది స్పష్టమైన 'బ్లేటెంట్ ఫ్రాడ్' మరియు వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడమే.
 
- ఈ నెల 28న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళనలు..

16 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనర్హులందరిని అందలం ఎక్కించే కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం పాల్పడింది. దీనిపై నిరుద్యోగ యువత అంతా ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు చేపట్టబోతున్నాం. 
 
- కేంద్రం తరహాలోనే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..

కేంద్రంలో నీట్ ఎగ్జామ్ వ్యవహారంలో అక్కడ విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించారు, ఎన్టీయే (NTA) అధికారులను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి కేంద్రంలో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వానికి, లోకేష్ బాబుకు వేరే న్యాయమా? లోకేష్ కు నిజంగా చిత్తశుద్ధి, నైతికత ఉంటే తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర సంస్థ అయిన సిబిఐ ద్వారా ఈ డిఎస్సి అక్రమాలపై పూర్తిస్థాయి ఎంక్వయిరీ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.

Back to Top