విజయనగరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను, విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి ఒంటెద్దు పోకడలు, అవినీతి నిర్ణయాలతో పాలన చేస్తోందనిశాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య నివాసంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్ర అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయ భూసేకరణతో పాటు అన్ని అనుమతులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవంతంగా పూర్తయ్యాయని.. ఇందులో కూటమి ప్రభుత్వ గొప్పదనం ఏమీ లేదని తేల్చి చెప్పారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. నిబంధనల మేరకే విజయనగరంలో పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... - డీఎస్సీ అక్రమాల పై – సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి. సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరైన డీఎస్సీ పరీక్షల నిర్వహణలోనూ, ఫలితాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ప్రభుత్వంలో పారదర్శకత, నిరుద్యోగుల పట్ల నిజాయితీ ఉంటే డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి, నిజాయితీ నిరూపించుకున్నాకే మళ్లీ ప్రభుత్వంలోకి రావాలి. డిఎస్సీలో పరీక్షల ముందు ఒక జీఓ, పరీక్షల తర్వాత మరొక జీఓ తెస్తూ తమకు నచ్చిన వారికి అపాయింట్‌మెంట్లు ఇచ్చేలా జీఓ నంబర్ 4, జీఓ నంబర్ 47 లలో సవరణలు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. స్పోర్ట్స్ కోటా నిబంధనలను కూడా సవరించి, దారి మళ్లించి తమ వర్గానికి చెందిన వారికి లబ్ధి చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారు. - రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు – విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. స్వర్గీయ వైఎస్సార్ ఆలోచన నుంచి వచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఈ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బకాయిలు పెట్టింది. గతంలో ముఖ్యమంత్రులగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే 2014లో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ఆపకుండా కొనసాగించాయి. ఇప్పుడు మాత్రం అదే చంద్రబాబు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు మరియు ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక నిరుద్యోగులు ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకుంటారు? ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి డబ్బులున్న ప్రభుత్వానికి... విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడానికి మాత్రం మనసు రావడం లేదు. - నిరుద్యోగ భృతి ఏది? – 'నాడు-నేడు' పాఠశాలల నిర్వీర్యం. ఎన్నికల సమయంలో 'బాబు వస్తే జాబ్.. లేకపోతే నిరుద్యోగ భృతి' అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా?" వైఎస్ జగన్ హయాంలో 'నాడు-నేడు' కింద ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. - భోగాపురం విమానాశ్రయం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషి ఫలితమే. గత టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అడిగి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంది. మా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ కేవలం 2,700 ఎకరాల భూమిని పారదర్శకంగా సేకరించి, ఎయిర్‌పోర్ట్‌కు 2,200 ఎకరాలు కేటాయించి పనులు వేగవంతం చేశారు. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావడం సంతోషకరం, ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి ఆయన ప్రత్యేక వరాలు ప్రకటించాలి. విమానాశ్రయ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత, ఆగస్టు 1 నాటికి ఈ ప్రభుత్వం చేసిన మోసాలపై బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలో నిజాలు వెల్లడిస్తాం. - మాన్సాస్ ఆస్తులు, పార్టీ ఆఫీస్ స్థలంపై స్పష్టత.. విజయనగరంలో పూర్వం నుంచి ఉన్న ఆస్తులన్నీ మహారాజు గారి పేరు మీద ఉన్న విషయాన్ని మేమందరం గౌరవించి అంగీకరించాం. రాజభరణాల రద్దు వంటి అంశాలన్నీ అందరికి తెలుసు. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్‌లో అవకతవకలు జరుగుతున్నాయని వారి సోదరుడు ఆనందగజపతిరాజు ఉన్నప్పుడు... దాన్ని ప్రభుత్వంలో కలపాలని గతంలో అశోక్ గజపతిరాజు గారే లేఖ రాసిన మాట వాస్తవం కాదా?. శంకర్ ఫౌండేషన్ సంస్థకు ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లే, వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కూడా నిబంధనల ప్రకారమే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ప్రతిదాన్నీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి ప్రయత్నించకుండా నాయకులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలి. .ఒకరి వైపు వేలు చూపించే ముందు తమ గత చరిత్రను, తమ కింద ఉన్న మచ్చలను తెలుసుకోవాలని గుర్తు చేశారు. అదే విధంగా వ్యవసాయం అంటే చంద్రబాబుకి గిట్టదని.. మరే రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో ఎరువుల కొరత ఎందుకు వచ్చిందిని ప్రశ్నించారు.