నగరి, విశాఖపట్నం, నెల్లూరు: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను తన ఇంటికి పిలిచి ఘోరంగా అవమానించడంపై వైఎస్సార్సీపీ మహిళా లోకం తీవ్ర స్థాయిలో భగ్గుమంది. మహిళలు ఓటుకు రెండు వేల రూపాయలు తీసుకున్నారని, అందువల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వారికి లేదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నాయకురాళ్లు ఆర్కే రోజా, వరుదు కళ్యాణి, కాకాణి పూజిత వేర్వేరు ప్రెస్‌మీట్లలో తీవ్రంగా ఖండించారు. దేవుళ్ల లాంటి మహిళలను ఉద్దేశించి అంత నీచంగా మాట్లాడిన చంద్రబాబు తక్షణమే రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా నగరి నుంచి డిమాండ్ చేశారు. అసలు రాజకీయాలకు 'ఓటుకు నోటు' సంస్కృతిని పరిచయం చేసిన పితామహుడే చంద్రబాబు అని, అలాంటి డర్టీ పొలిటిషియన్ మహిళలకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి డబ్బులు వాడిన వ్యక్తి నేడు మహిళలను లంచగొండులు అనడం సిగ్గుచేటని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేయలేదని, మోసాన్ని, వంచనను మాత్రమే రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలును పూర్తిగా గాలికి వదిలేసి, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి ఈ పబ్లిసిటీ స్టంట్ చేశారని ఆమె విమర్శించారు. మహిళలకు ఈ 25 నెలల కాలంలో ఇవ్వాల్సిన రూ. 1,80,000 కోట్ల బాకీని ఎగనామం పెట్టి, ఏదో మూడు వేల కోట్లు ఇచ్చేశానని అబద్ధాలు చెబుతున్నారని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచలేదని తిరుమల శ్రీవారి సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేయగలరా అని ఆమె సూటిగా సవాల్ విసిరారు. ఇక నెల్లూరులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ.. హామీలపై మహిళలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే చంద్రబాబు ఇలా ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. జగనన్న తెచ్చిన దిశా చట్టాన్ని రద్దు చేసి, నేడు విచ్చలవిడిగా గంజాయి, మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని పూజిత ఆరోపించారు. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి వంటి పథకాలను ఒక కలలా మార్చేసి, మహిళల ఆశలపై నీళ్లు చల్లారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ధైర్యంగా ఓట్లు అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని ముగ్గురు నాయకురాళ్లు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. మహిళల సంక్షేమాన్ని పక్కనపెట్టి, దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర మహిళల చేతిలో చావుదెబ్బ తప్పదని ఈ సందర్భంగా వారు తేల్చిచెప్పారు. హామీలపై ప్రశ్నిస్తారనే భయంతో మహిళపై ఎదురుదాడి: మాజీ మంత్రి ఆర్కే రోజా నగరి: జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అవమానించారని, అందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆయన ముందుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. నగరిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయాలని మహిళలు ఎక్కడ ప్రశ్నిస్తారోననే భయంతోనే చంద్రబాబు ముందుగానే ఎదురుదాడికి దిగారని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పల్లెవెలుగు బస్సులో మహిళలను తన నివాసానికి తీసుకెళ్లి భోజనాలు పెట్టే పేరుతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని అన్నారు. మహిళలు ఎవరు ఏది ఇచ్చినా తీసుకునే వారిలా, డబ్బుకు ఆశపడేవారిలా చంద్రబాబు చిత్రీకరించడం అత్యంత అవమానకరమని మండిపడ్డారు. “మీరు రూ.2,000 ఓటుకు తీసుకుంటే, ఆ తీసుకున్న వ్యక్తి రూ.2 లక్షలు సంపాదించాలనుకుంటాడు.. మీకు ఎలా మంచి చేయగలుగుతాడు?” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఓటుకు నోటుపై నీతులు చెప్పే ముందు చంద్రబాబు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకోవాలని అన్నారు. రాజకీయాలకు ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే ఓటుకు నోటు రాజకీయాలకు పరిచయం చేసింది చంద్రబాబు నాయుడేనని ఆర్కే రోజా ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి డబ్బును ఉపయోగించారని, అనంతరం తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో, వీడియోలతో సహా దొరికిపోయారని విమర్శించారు. డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేయడం, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఆరోపించారు. రెండు ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు లక్ష కోట్లకు ఎదిగారని చెబుతున్నారని, ఇంత ఆస్తి ఎలా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారని, ఇసుక, గ్రావెల్, కంకర, గ్రానైట్ వంటి వాటిపై అధికార పార్టీ నాయకుల దోపిడీకి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపించండి ఎన్నికల సమయంలో “అమ్మ, చెల్లి, తల్లి” అంటూ మహిళల వద్దకు వెళ్లి ఓట్లు అడిగిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలను డబ్బుకు అమ్ముడుపోయినవారిగా మాట్లాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రోజా అన్నారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు 2029 ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. ఓటుకు నోటుపై నీతులు చెప్పడం కాదు.. ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్, రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ మహిళలకు నెలకు రూ.3,000 వంటి హామీలను అమలు చేయాలని అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని రద్దు చేశారని, దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మహిళలకు చేయాల్సిన సంక్షేమాన్ని పక్కనపెట్టి, మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు. మహిళలు, మైనర్ బాలికల భద్రతకు ముప్పు ఏర్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బినామీలకు రాష్ట్ర వనరులు దోచిపెడుతున్నాడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల కింద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, రాష్ట్ర వనరులు, కాంట్రాక్టులు, అమరావతి, పోలవరం, విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ప్రజల డబ్బుతో విదేశీ పర్యటనలు చేస్తూ, పర్యటనల వివరాలను కూడా పారదర్శకంగా వెల్లడించడం లేదని విమర్శించారు. మహిళలు కుటుంబాలను నిలబెట్టే శక్తి. భర్త ఎంత సంపాదించినా, కుటుంబాన్ని గౌరవంగా నడిపిస్తూ పిల్లల చదువులు, అత్తమామల బాధ్యతలు, కుటుంబ సంక్షేమాన్ని చూసుకునే మహిళలను డబ్బు కోసం వెంపర్లాడేవారిగా చిత్రీకరించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. మహిళల చేతిలో టీడీపీకి చావుదెబ్బ తప్పదు అని హెచ్చరించారు. నిజాయితీగా ఎన్నికలకు వెళ్తామని ప్రమాణం చేయగలరా.. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. భవిష్యత్తులో డబ్బుతో రాజకీయాలను ప్రభావితం చేయకుండా, డబ్బుతో ఎమ్మెల్యేలను కొనకుండా, తాము చేసిన సంక్షేమాన్ని చెప్పుకుని నిజాయితీగా ఎన్నికలకు వెళ్తామని ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ముందు మీరు ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చండి.. ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పండి అని హితవు పలికారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమాన్ని అందించిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హామీలను నెరవేర్చకుండా కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమకు జరిగిన మోసం, అవమానాన్ని గుర్తుపెట్టుకుని కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. మహిళలకు వంచన, దగా రెట్టింపు చేశారు: సూటిగా ప్రశ్నించిన వరుదు కళ్యాణి విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు దగాను, వంచనను మాత్రమే రెట్టింపు చేశారని, మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేయలేదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు డ్వాక్రా, ఉచిత బస్సు మహిళలతో చంద్రబాబు నిర్వహించిన తేనీటి విందు మహిళల సమస్యలకు సమాధానం చెప్పే కార్యక్రమం కాదని, ఒక పచ్చి ‘పబ్లిసిటీ స్టంట్’ అని విమర్శించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా, ఇప్పుడు అదే మహిళలకు నీతులు చెప్పడం చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. మహిళలకు రూ.18 వేల ఆర్థిక సాయం, ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, 3 సెంట్ల స్థలం, ఇళ్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఏమి చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 1,80,000 కోట్ల బాకీ ఎగనామం.. రూ. 3 వేల కోట్ల బోగస్ కబుర్లు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం, జూన్ నుంచే లెక్కవేసుకున్నా ఈ 25 నెలల కాలానికి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం బాకీ పడిన మొత్తం అక్షరాలా రూ. 1,80,000 కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని ఎగనామం పెట్టి, ఏదో రూ. 3,000 కోట్లు ఇచ్చేశానని పచ్చి అబద్ధాలు చెబుతారా? ఆ మూడు వేల కోట్లు ఏ అకౌంట్లో వేశారో తక్షణం సమాధానం చెప్పాలి. 'ఓటుకు నోటు' పితామహుడు చంద్రబాబే మహిళలు రూ. 2 వేలు తీసుకుని ఓట్లు వేస్తున్నారని, వారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదని చంద్రబాబు మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనం. అసలు ఈ దేశంలో 'ఓటుకు నోటు' సంస్కృతిని తెచ్చిందే చంద్రబాబు కదా? నాడు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయి, హైదరాబాద్ లాంటి ఉమ్మడి రాజధానిని, 2 లక్షల కోట్ల ఆస్తులను వదిలేసి పిరికివాడిలా పారిపోయి వచ్చింది మీరు కాదా? వేల కోట్లు దోచుకుంటున్న చంద్రబాబు మహిళలను లంచగొండులు అనడం సిగ్గుచేటు. ఉచిత బస్సు కాదు.. ఆర్టీసీని అమ్మే కుట్ర: మేనిఫెస్టోలో ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక కేవలం 5 వేల పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితం చేసి మహిళలను దారుణంగా మోసం చేశారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో మహిళలకు ఎందుకు స్థానం లేదు? నిన్నటి సదస్సులో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయనగరం నుంచి వైజాగ్‌కి ఫ్రీ బస్సులో వస్తుందని స్కిట్లు వేయించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఉచిత బస్సు పేరుతో క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే భారీ కుట్రకు చంద్రబాబు తెరలేపారు. సున్నా వడ్డీ ఏదీ? సూపర్ సిక్స్ ఏమైంది?: ఆనాడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల కోసం రూ. 4,800 కోట్లు కేటాయించి ఠంచనుగా సున్నా వడ్డీ అమలు చేశారు. అధికారంలోకి రావడం కోసం 3 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలకు సున్నా వడ్డీ ఇస్తామని నమ్మించి, తీరా ఇప్పుడు 3 లక్షల రుణానికి కూడా సున్నా వడ్డీ ఇవ్వకుండా మహిళల నోట్లో మట్టి కొట్టారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 'ఆడబిడ్డ నిధి', నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్, 3 సెంట్ల స్థలం.. ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ ఏమయ్యాయి? దిశా చట్టం రద్దు.. విచ్చలవిడిగా గంజాయి, మద్యం మహిళల భద్రత కోసం జగనన్న తెచ్చిన 'దిశా చట్టాన్ని' రద్దు చేసి మహిళల ఆత్మగౌరవాన్ని రోడ్డున పడేశారు. ఈరోజు రాష్ట్రంలో లక్షకు పైగా బెల్ట్ షాపులు తెరిచి, గంజాయి, డ్రగ్స్, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఇదా మీరు మహిళలకు ఇచ్చే భద్రత? తాలిబొట్లు తెంచే ఈ పాలనతోనా మహిళల ఆత్మగౌరవం పెరిగేది? తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయగలరా? నిత్యం వెంకటేశ్వర స్వామితో వర్చువల్‌గా మాట్లాడతాను అని ప్రగల్భాలు పలికే చంద్రబాబు నాయుడికి వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. "నేను ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచలేదు" అని తిరుమల శ్రీవారి సాక్షిగా మీరు ప్రమాణం చేయగలరా? ఈ రాష్ట్ర మహిళలు అమాయకులు కారు. ఒకసారి మీ అబద్ధాలను నమ్మి మోసపోయారు కానీ, పదే పదే మోసపోవడానికి సిద్ధంగా లేరు. పాలిచ్చే తల్లులకు.. తప్పు చేసే పాలకుల అంతు చూడటం, ప్రభుత్వాలను కూలదోయడం కూడా బాగా తెలుసు! ఇప్పటికైనా మాయమాటలు మాని, మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి. లేనిపక్షంలో, ఈ రాష్ట్రంలోని మహిళలంతా ఏకమై వైఎస్సార్సీపీ అండతో మీ ప్రభుత్వానికి చరమగీతం పాడటం ఖాయం అని హెచ్చరించారు. - మహిళలపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం : వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ నెల్లూరు: స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను తన ఇంటికి పిలిచి, ఓట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారని, కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు వారికి లేదని అవమానించడం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆయన మహిళలపై ఇలా ఎదురుదాడికి దిగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ధైర్యంగా ఓట్లు అడిగిన ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న మాత్రమే అని, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు మహిళలను కించపరిచే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపైనా, తమ హక్కుల పైనా చైతన్యవంతంగా ప్రశ్నిస్తున్న మహిళలను "లంచగొండులు" అని ముద్రవేసి అణచివేసే కుట్రను మేము ఎంతమాత్రం సహించబోమని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మహిళల భద్రత, సంక్షేమం, ఉపాధి, విద్య వంటి అంశాలపై సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు, ప్రశ్నించే గొంతులను అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ధ్వజమెత్తారు. మహిళల భద్రతకు శ్రీరామరక్ష అయిన 'దిశా చట్టాన్ని' రద్దు చేసిన ఈ కూటమి ప్రభుత్వం, మహిళల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది అన్నారు. 'ఆడబిడ్డ నిధి', 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ హామీలను అటకెక్కించడమే కాకుండా, ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏదో లక్కీ లాటరీలా మార్చేశారని ఆరోపించారు. ఇక ఉచిత బస్సు పథకం పేరుతో బస్సుల సంఖ్యను కుదించి, ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. మహిళా సాధికారత గురించి ప్రగల్భాలు పలికే చంద్రబాబు, ముందుగా మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అండతో మహిళా లోకం చేసే పోరాటాన్ని, ఉద్యమాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేదని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడిగే ముందు ఇచ్చిన ప్రతి హామీని ఎంతవరకు అమలు చేశారో ప్రజలకు లెక్క చెప్పే ధైర్యం ఉండాలన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేశారు.