విద్యారంగానికి వై. కొండారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం

ఆయన మృతి రాయలసీమ విద్యారంగానికి తీరని లోటు

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి: ప్రముఖ విద్యావేత్త, తిరుపతి రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై. కొండారెడ్డి గారి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

విద్యను కేవలం ఒక వృత్తిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి, వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప విద్యా ప్రదాత కొండారెడ్డి గారని శ్రీ వైయస్‌ జగన్‌ కొనియాడారు.

రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో విలువైనదని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆయన అందించిన ప్రోత్సాహం, సహకారం మరువలేనివని పేర్కొన్నారు.

ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన కొండారెడ్డి గారి మృతి రాయలసీమ విద్యారంగానికి, విద్యార్థి లోకానికి తీరని లోటని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. విద్యారంగంపై ఆయనకు ఉన్న అంకితభావం, ఆయన ఆశయాలు, సేవలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

వై. కొండారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాయలసీమ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులకు శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top