విదేశాల్లోనూ, బయట ప్రాంతాలలో ఉన్న అర్హులైన ఓటర్లను తొలగించొద్దు...

రాయచోటి నియోజక వర్గంలో 20 వేల మందికి పైగా ఓటర్లకు నోటీసులు..

ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలివ్వాలి: శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో రాయచోటి నియోజకవర్గానికి చెందిన 20 వేల మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వీరిలో చాలామంది చదువులు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినవారే ఉన్నారని, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న అర్హులైన ఓటర్లను,బయట ప్రాంతాలలో ఉన్న వారు  స్థానికంగా అందుబాటులో లేరనే కారణంతో ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో స్థానికంగా ఓటరు అందుబాటులో లేకపోయినా 
వారితల్లి దండ్రులు,సమీప  కుటుంబ సభ్యులు డిక్లరేషన్ సమర్పిస్తే సరిపోతుందని చెప్పిన అధికారులు ఇప్పుడు విదేశాల్లో ఉన్నవారు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. విదేశాల్లో ఉన్నవారు తక్షణమే స్వదేశానికి బయలుదేరి రావడం ఆర్థికంగా, ఆచరణాత్మకంగా ఎంతో కష్టంతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న ఓటర్లను వీడియో కాల్ ద్వారా సంప్రదించి, వారు అందించే వివరణలు, సమర్పించే ధ్రువపత్రాలను పరిశీలించి ఎన్నికల అధికారులు సంతృప్తి చెందేలా ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకుని వారి ఓటు హక్కును సంరక్షించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. .విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి స్వదేశానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి ముందస్తుగా తగిన సమాచారం ఇవ్వకుండా, అకస్మాత్తుగా ఓట్లు తొలగిస్తామని నోటీసులు ఇవ్వడం సరైన విధానం కాదని అన్నారు.ఈ విషయంపై స్థానిక అధికారులను ప్రశ్నిస్తే తమకు పూర్తి సమాచారం లేదని, పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే చర్యలుతీసుకుంటున్నామని చెబుతున్నారని  పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల విషయంలో ఇలాంటి అయోమయ పరిస్థితులు లేకుండా ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానికంగా అందుబాటులో లేకపోయినంత మాత్రాన అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించకుండా, వారి నుంచి వీడియో కాల్ ద్వారా వివరణలు, అవసరమైన పత్రాలు స్వీకరించి ఓటు హక్కును కాపాడాలని  ఎన్నికల సంఘాన్ని కోరారు.విదేశాల్లో ఉన్నారనే కారణంతో అర్హులైన ఓటర్ల హక్కును హరించకూడదని, ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడి ఓటు విలువైనదే నని, ఓటర్లను తొలగించడం కాకుండా, వారి ఓటు హక్కును సంరక్షించే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Back to Top