తాడేపల్లి: గ్రూప్–1పై కూటమి ప్రభుత్వం సాగిస్తున్న గోబెల్స్ ప్రచారం వెనుక అసలు కుట్రను మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ బట్టబయలు చేశారు. సిట్ నివేదిక, ఏపీపీఎస్సీ సభ్యులు కోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో వాస్తవాలు స్పష్టంగా ఉన్నా వాటిని పక్కనపెట్టి గ్రూప్–1పై బురదజల్లడం రాజకీయ పన్నాగమేనని మండిపడ్డారు. డీఎస్సీలో బయటపడుతున్న అక్రమాలు, అవకతవకల నుంచి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను కాపాడేందుకు గ్రూప్–1 అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్–1పై ఏ ఆధారాలతో ప్రచారం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని, అదే సమయంలో డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పి తీరాలని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో ఆదిమూలపు సురేష్ ఏమన్నారంటే.. - సిట్ నివేదికే సమాధానం “గ్రూప్–1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. సిట్ నివేదికలో శాస్త్రీయ ఆధారాలతో అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఏపీపీఎస్సీ సభ్యులు కోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కూడా హైలాండ్‌లో మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారు. అయినా వాస్తవాలను వక్రీకరించి గ్రూప్–1పై బురదజల్లడం ఎందుకు? ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.” - పారదర్శకంగా జరిగిన మూల్యాంకనంపై దుష్ప్రచారం “గ్రూప్–1 మెయిన్స్ పత్రాల మూల్యాంకనం ఎవాల్యుయేటర్లు, స్క్రూటినైజర్లు, చీఫ్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలో జరిగింది. అవసరమైతే రెండోసారి, మూడోసారి కూడా మూల్యాంకనం జరిగే విధానం ఉంది. మూడో వ్యక్తి జోక్యానికి అవకాశం లేని ఈ ప్రక్రియను అక్రమంగా చిత్రీకరించడం రాజకీయ దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు. ఐదుగురు ఏపీపీఎస్సీ సభ్యులు సంతకాలతో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని వాస్తవాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.” - డీఎస్సీ అక్రమాలపై సమాధానం ఎక్కడ? “గ్రూప్–1 అంశాన్ని తెరపైకి తెచ్చి డీఎస్సీలో జరుగుతున్న అక్రమాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీలో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వ్యవహారం, స్పోర్ట్స్ కోటా నియామకాలు సహా అనేక అంశాలపై అధికారిక లేఖలు, ఆధారాలు ఉన్నాయి. గ్రూప్–1పై విచారణలకు సిద్ధమంటున్న ప్రభుత్వం డీఎస్సీపై విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తోంది? లోకేశ్‌ను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా డీఎస్సీలో జరిగిన అక్రమాల వాస్తవాలను ఎవరూ దాచిపెట్టలేరు” అని ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు.