ఆళ్లగడ్డలో వైయ‌స్ఆర్‌ విగ్రహానికి అవమానం

నల్లరంగు పూసి, ముఖానికి గుడ్డ కట్టి దుండగుల దుశ్చర్య.. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగుల బిజేంద్రారెడ్డి

నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూసి, ముఖానికి గుడ్డ కట్టి అవమానించారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు గంగుల బిజేంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని అవమానించడం అంటే ఆయనను అభిమానించే కోట్లాది ప్రజల మనోభావాలను అవమానించడమేనని గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్‌ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.

 నల్లరంగు పూసినా ప్రతిష్ట మసకబారదు

విగ్రహానికి నల్లరంగు పూసినంత మాత్రాన వైయ‌స్ఆర్ ప్రతిష్ట మసకబారదని గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ అందించిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. ఈ ఘటనకు ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని గంగుల బిజేంద్రారెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైయ‌స్ఆర్ విగ్రహాన్ని అవమానించిన ఘటన వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో తేల్చాలని గంగుల బిజేంద్రారెడ్డి కోరారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను కోరారు. విగ్రహాన్ని అవమానించిన వ్యక్తులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గంగుల బిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Back to Top