తాడేపల్లి: కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలో మెగా డియస్సీ 2025 నియామకాల్లో జరిగిన భారీ అవినీతి జరిగినందని దీనిపై సీబీఐ విచారణ చేయడంతో పాటు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డియస్సీ అభ్యర్ధుల తరపున వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని.. అందులో భాగంగా.. ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. మెగా డియస్సీ కాదు దగా డియస్సీ... మెగా డియస్సీ 2025 లో 16,347 పోస్టుల భర్తీ పేరుతో కూటమి ప్రభుత్వంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యాశాక మెంత్రి నారా లోకేష్ లు భారీ అవినీతికి పాల్పడ్డారు. పోస్టులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అక్రమాలు జరగకపోతే.. పరీక్షలు రాసిన అభ్యర్థులకు సంబంధించి మెరిట్ జాబితా, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను ప్రతి జిల్లా కలెక్టరేట్ నోటీస్ బోర్డులో ఎందుకు ప్రదర్శించలేదు? మరో కీలకమైన అంశం... ప్రశ్నాపత్రాల తయారీ, అప్‌లోడింగ్ బాధ్యతలను ఒకే ఏజెన్సీకి, ఒకే అధికారికి అప్పగించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ప్రశ్నా పత్రాల అప్లోడింగ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో కృష్ణా జిల్లాకు చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు డియస్సీలో టాప్ ర్యాంక్ వచ్చింది. మరి టాప్ ర్యాంక్ వచ్చిన అతనికి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కూడా ఎందుకు పిలవలేదు? స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జీవో నెంబరు : 4, జీవో నెంబరు 47 లను తీసుకొచ్చి, డియస్సీ పరీక్ష రాయనవసరం లేదంటూ లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారు. తమకు కావాల్సిన వారికి పోస్టులు కట్టబెట్టుకున్న తర్వాత.. గేట్లు మూసేసేందుకు మరలా జీవో నెంబరు : 56 ఇచ్చారు. దీని ప్రకారం మరలా పాత విధానంలోనే స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులు డియస్సీ రాయాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన అవినీతి కాదా?. 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలిచారంటేనే ఉద్యోగం వచ్చినట్లు లెక్క. కానీ, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రిజెక్టెడ్ లిస్ట్ ఎందుకు విడుదల చేయలేదు? మెరిట్ సాధించిన అభ్యర్థులకు రిజర్వేషన్లలో పోస్టులు కేటాయించి, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర నష్టం చేశారు. ఈ నేపధ్యంలోనే డియస్సీలో జరిగిన అక్రమాలు, తమకు జరిగిన అన్యాయంపై అభ్యర్థులంతా తమ వద్ద ఉన్న ఆధారాలతో మా నాయకుడు వైఎస్. జగన్ ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. దీనికి స్పందించిన వైయస్.జగన్ డియస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే ప్రభుత్వం నోరు మెదపలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పారిపోయారు. కేంద్రంలో నీట్ లీకేజీకు కారణమైన బాధ్యులను అరెస్ట్ చేశారు. ఇక్కడ తప్పు జరగలేదని భావిస్తే, మీరు కూడా సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? సీబీఐ విచారణ జరిపితే కూటమి నేతల అవినీతి బండారం బయటపడుతుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం డియస్సీ అక్రమాలపై ముందుకు రాకపోతే.. మా అధినేత వైఎస్ . జగన్ పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నామని రవిచంద్ర తెలిపారు. ప్రధానంగా డియస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, నారా లోకేష్ రాజీనామా, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలనే డిమాండ్లతో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు ఎలాగైతే పోరాడి విజయం సాధించారో, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేసేంతవరకు పోరాటం ఆగదని రవిచంద్ర స్పష్టం చేశారు.