ప్ర‌భుత్వ నిర్లక్ష్యంతోనే మత్స్యకారుల గల్లంతు 

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీవ్ర ధ్వజం

విశాఖ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ 

గ‌ల్లంతైన ఆరుగురిని త‌క్ష‌ణం వెతికి తీసుకురావాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

గ‌ల్లంతైన విష‌యం తెలిసిన 20గంట‌ల దాకా స‌హాయ‌క చ‌ర్య‌లు మొద‌లు కాలేదు

వైయ‌స్ఆర్‌సీపీ రంగంలోకి దిగిన త‌ర్వాతనే అధికారుల్లో చ‌ల‌నం 

స్థానిక ఎంపీ భ‌ర‌త్‌, జ‌న‌సేన ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

మ‌త్స్య‌కారుల ప్రాణాలంటే ఈ ప్ర‌భుత్వానికి లెక్కే లేకుండా పోయింది

ప్ర‌భుత్వ యంత్రాంగం, నాయ‌కులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేది

కూట‌మి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ 

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యం, స్ధానిక ఎంపీ, ఎమ్మ‌ల్యేల ఉదాసీన వైఖ‌రి వల్లే వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ ప్ర‌భుత్వానికి మ‌త్స్య‌కారుల ప్రాణాలంటే లెక్కే లేద‌ని, సూటు బూటు వేసుకున్న ధ‌న‌వంతుల ర‌క్ష‌ణ‌, సౌక‌ర్యాల కోస‌మే ప‌ని చేస్తోంద‌ని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏదైనా మ‌త్స్య‌కారుల బోటుకు ప్ర‌మాదం జ‌రిగితే వెంట‌నే స్పందించి వారిని కాపాడేలా నిర్దిష్ట‌మైన వ్యవ‌స్థ‌, టెక్నాల‌జీ అందుబాటులో ఉండేద‌ని చెప్పారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మత్స్య‌కారులను ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని, వ్య‌వ‌స్థ‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీచ్ షాక్స్ పేరుతో బీచ్‌ల‌లో మ‌ద్యం అమ్ముకోవ‌డంలో ఉన్న శ్రద్ధ.. మత్స్యకారుల ప్రాణాలపై చంద్రబాబుకు లేదని ధ్వ‌జ‌మెత్తారు. గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల‌ను ఎలాగైనా వెతికి తీసుకురావాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన 20 గంట‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వం స్పందించి స‌హాయ కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున డిమాండ్ చేస్తే కానీ ప్ర‌భుత్వంలో క‌ద‌లిక రాలేద‌న‌, ఈ ప్ర‌మాదంపై మంత్రులు లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట‌నే స్పందించాల‌ని మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌ డిమాండ్ చేశారు.  

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే... 

సకాలంలో స్పందించని ప్రభుత్వ యంత్రాంగం 

వేటకు వెళ్లిన మత్స్యకారులు గంగవరం వరకు వచ్చామని, మరో రెండు మూడు గంటల్లో ఇంటికి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ రాత్రయినా వారు తిరిగి రాలేదు, వారి ఫోన్లు కూడా పని చేయడం మానేశాయి. ఈ ఆందోళనకర విషయాన్ని మత్స్యకారుల కుటుంబాలు వెంటనే ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ, రాత్రి 9 గంటల వరకు ఎలాంటి సహాయక చర్యలు ప్రారంభించలేదు.
మత్స్యకారులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే స్పందించాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నేను స్వయంగా ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లినప్పటికీ, అప్పటికి ఫిషరీస్ జేడీ అక్కడకు చేరుకోకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రమాదం జరిగి 20 గంటలు గడిచిన తర్వాత గానీ స్పందించ‌లేదు. కేవలం ఒకే ఒక్క ఛాపర్‌ని రక్షణ చర్యల కోసం పంపించారు. మత్స్యకారుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకనో ఈ సంఘటనే రుజువు చేస్తోంది.

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలు బేఖాతర్ 

జూలై 3, 4 తేదీల్లో సముద్రంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయని, వాతావరణం చేపల వేటకు అనుకూలంగా ఉండదని వాతావరణ శాఖ సలహా బోర్డు ముందే హెచ్చరించింది. ఇంత పెద్ద హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రభుత్వం కనీసం అలర్ట్ కాలేదు, అప్రమత్తం చేయడానికి వార్ రూమ్ కూడా ప్రారంభించలేదు. వైఎస్సార్‌సీపీ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి, మత్స్యకారులను కాపాడాలని డిమాండ్ చేసే వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ, ఉన్నతాధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. స్ధానిక ఎంపీ భ‌ర‌త్ వీకెండ్ లో ఎంజాయ్ చేయ‌డానికి హైద‌రాబాద్ వెళ్లిపోయాడు. రాత్రయిపోయింది.. అంటూ ఆర్డీఓ, అవకాశం ఉన్నంత వరకు గాలిస్తాం.. అంటూ కలెక్టర్ ఇస్తున్న బాధ్యతారాహిత్య స్టేట్మెంట్లు చూస్తుంటే మత్స్యకారుల జీవితాలపై వీరికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోంది.

ప‌ట్టించుకోని కూటమి నాయ‌కులు 

రాష్ట్ర హోంమంత్రి అనిత బాధితులను నేరుగా పరామర్శించాల్సింది పోయి, తాపీగా వీడియో కాల్ మాట్లాడి మమ అనిపించారు. విశాఖ ఎంపీ భరత్ వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి మత్స్యకారులు గల్లంతైనా ఆయన అందుబాటులోకి రాలేదు. సంబంధిత అధికారులు, వ్య‌వ‌స్థ‌లను అప్ర‌మ‌త్తం చేయ‌లేదు. అన్నీ తానే అయి ప్ర‌భుత్వాన్ని నడిపిస్తున్నట్టు ఫీలయ్యే మంత్రి లోకేష్ కూడా మత్స్యకారుల ఆచూకీ గల్లంతు కావడంపై ఇప్పటివరకు స్పందించలేదు, పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ దారుణంపై నోరు మెదపకపోవడం దారుణం.

టెక్నికల్ వ్యవస్థల ధ్వంసం 

వాతావరణం అనుకూలించక బోట్లు పనిచేయకపోవడంతో మత్స్యకారులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దేవుడిని ప్రార్థించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, ఈదుకుంటూ వస్తున్న ఒక మత్స్యకారుడిని ఒక చైనా బోటు గమనించి రక్షణ కల్పించి ఒడ్డుకు చేర్చింది. గల్లంతైన మిగిలిన ఆరుగురిని వెతకడం చేతగాని మంత్రి అచ్చెన్నాయుడు.. అదృష్టవశాత్తు చైనా బోటు వల్ల బతికొచ్చిన వ్యక్తిని "మేమే రక్షించాం" అని డబ్బా కొట్టుకోవడం, గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. గత వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాద సంకేతాలకు సంబంధించిన‌ టెక్నికల్ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేవి. ఏదైనా బోటు మునిగిపోయే పరిస్థితి వస్తే వెంటనే హార్బర్‌లో సిగ్నల్స్ రావడం, పొగ రావడం జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ టెక్నికల్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, అవి ఇప్పుడు పనిచేయడం లేదు.

మత్స్య‌కారుల జీవితాలంటే ప్ర‌భుత్వానికి లెక్కే లేదు

ఈరోజువైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉండి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఉంటే ఇలాంటి ఘోర పరిస్థితి వచ్చేదే కాదు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఛాపర్లు, స్పీడ్ బోట్లను రంగంలోకి దించి, ఎంత రాత్రయినా మత్స్యకారులను సురక్షితంగా వెతికి తెచ్చేవారు.
కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం కేవలం విశాఖ బీచ్‌లలో బీచ్ షాక్స్ పేరుతో మ‌ద్యం అమ్ముకుని కాసులు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ, మత్స్యకారుల జీవితాలను కాపాడటంపై లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకు గుర్తింపు లేదు, వారి ప్రాణాలకు విలువ కూడా లేదు. ఈ ప్రభుత్వం కేవలం సూటు, బూటు వేసుకున్న డబ్బన్న వారి రక్షణ, సౌకర్యాల కోసమే పనిచేస్తోంది. గల్లంతైన మత్స్యకారులలో ఒకరికి ఇటీవలే వివాహం జరిగింది, మరొకరి భార్య గర్భవతిగా ఉన్నారు, మరికొందరికి చిన్న చిన్న పిల్లలున్నారు. వారి కుటుంబాల కష్టాలు తలుచుకుంటే మనసు తరుక్కుపోతోంది. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమే. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో పదో వంతు శ్రద్ధ మత్స్యకారులను కాపాడటంలో చూపించి ఉంటే ఈరోజు ఇంతమంది గల్లంతయ్యేవారు కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని శక్తులను రంగంలోకి దించి గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను వెతికి తీసుకురావాలి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ డిమాండ్ చేశారు. 

Back to Top