వడ్డేశ్వరం: విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్లో లాకప్ డెత్ కు గురై చనిపోయిన గాదె సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, ఇప్పటికే అన్ని సాక్ష్యాలు మాయం చేసేశారని, ఈ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జికి అప్పగిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని సాయికృష్ణ మేనమామ నివాసంలో ఉన్న అతని తల్లి గాదె విజయలక్ష్మిని వారు పరామర్శించి పార్టీలో కాపు నేతలు చందాల ద్వారా సేకరించిన రూ.20 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ప్రెస్ మీట్లో తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు ఏమన్నారంటే.. సాయికృష్ణ కేసులో దర్యాప్తుపైనే మా అభ్యంతరం: తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని ఇవాళ కలిశాం. వైయస్ఆర్‌సీపీలో కాపు సోదరులంతా కలిసి ఈ మధ్య వెంకటాయపాలెంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ సాయికృష్ణ లాకప్ డెత్ గురించి చర్చించాం. సాయికృష్ణ చనిపోయాక అతని తల్లికి ఎలాంటి ఆధారం లేదు, కుటుంబ ఆస్తి కూడా లేకపోవడంతో ముఖ్యమైన నాయకులంతా కలిసి ఆమెను ఆదుకోవాలని నిర్ణయించాం. దీని ప్రకారం ఓ 20 లక్షల రూపాయల డీడీని ఇవాళ తీసుకొచ్చి ఇచ్చాం. ప్రభుత్వ చర్యల్ని తప్పుబడుతూనే మేం మాట్లాడుతున్నాం. సాయికృష్ణను సమర్థించడానికి మేం సిద్దంగా లేం. కానీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న విధానానికి మాత్రం వ్యతిరేకం. చనిపోయిన సాయికృష్ణను ఎవరూ తీసుకురాలేరు. ప్రస్తుతానికి ఈ కేసులో సీఐ నాగరాజును మాత్రమే నిందితుడిగా చూపిస్తున్నారు. పై అధికారులకు సంబంధం లేకుండా నాగరాజు ఒక్కడే ఇది చేయలేదు. సీపీ రాజశేఖర్ బాబును తప్పించి నాగరాజును బలి పశువును చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ ను పంపింది ఎవరు, సాయికృష్ణను చంపింది ఎవరు అనేది ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండదు. సిట్టింగ్ జడ్డి లేదా సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు బయటికి: అంబటి రాంబాబు, మాజీ మంత్రి సాయికృష్ణది దురదృష్టకరమైన కేసు. ఇప్పటికీ మిస్టరీ వీడని కేసు. గత నెల 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించే వరకూ ఈ కేసును గాలికొదిలేశారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఎంత లోపభూయిష్టంగా వ్యవహరించారో చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాగరాజును వెంటనే అరెస్టు చేయకుండా బేరసారాలు చేశారు. చివరికి ఒత్తిడి వస్తే అరెస్టు చేశారు. ఆయన సెల్ ఫోన్ ను మాత్రం తీసుకోలేదు. తీసుకుంటే ఆయన కమిషనర్ తో, ఇతరులతో మాట్లాడిన విషయాలు బయటికొస్తాయి. ఆ తర్వాత స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని చెప్పేశారు. చంద్రబాబు ప్రతీ రోజూ టెక్నాలజీ మాటలు మాట్లాడే రాష్ట్రంలో సీసీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది. స్టేషన్లో కానిస్టేబుళ్ల సెల్ ఫోన్లు అడిగితే నాగపూర్ లో అమ్ముకున్నారని చెప్పేశారు. బూడిద మాత్రం స్టేషన్ పై భాగంలో దొరికిందట. అక్కడే శవాన్ని తగులబెట్టారా అన్న క్లారిటీ లేదు. సిట్ దర్యాప్తు ఎంత దారుణంగా ఉందో ఇదే నిదర్శనం. సాయికృష్ణపై కేసులున్నాయని చెప్తున్నారు, కేసులుంటే చంపేస్తారా అన్నది ఇక్కడ ప్రశ్న. సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ లో సీబీఐ విచారణ కావాలని కోరింది. దీంతో ఇప్పటికీ ఆమెను మేనేజ్ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. ఆ కుటుంబానికి మేం అండగా నిలబడతాం.