విశాఖపట్నం: ప్రశాంతతకు, కుటుంబ పర్యాటకానికి మారుపేరైన విశాఖపట్నం సాగరతీరాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభావం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తీరప్రాంతాల్లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం దుకాణాలు, బార్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు వ్యతిరేకంగా సోమవారం విశాఖ ఆర్కే బీచ్‌లో మహిళా లోకం ఉవ్వెత్తున కదలివచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది మహిళలు నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీచ్‌లలో మద్యం ఏరులై పారిస్తే మహిళల రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడుతూ.. బీచ్ షాక్స్ జీవో ప్రతులను రోడ్డుపైనే తగలబెట్టారు. అంతేకాకుండా, సాగరతీరంలో మందు బాటిళ్లను పగలగొట్టి వినూత్న రీతిలో తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేశారు. సంపద సృష్టి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో, మహిళల భద్రతతో చెలగాటమాడుతోందని పార్టీ ముఖ్య నేతలు, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... వరుదు కల్యాణి, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు. "విశాఖపట్నం బీచ్ కేవలం వైజాగ్ వాసులకే కాదు, మొత్తం ఉత్తరాంధ్రా వాసులకు ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం (డెస్టినెషన్). కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో నిత్యం కిటకిటలాడే ఈ పవిత్రమైన బీచ్‌లో ఇప్పుడు మద్యం దుకాణాలకు అనుమతినివ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీచ్ షాక్స్ పేరుతో ఇక్కడ మద్యం సంస్కృతిని తీసుకురావడం అన్యాయం." బొత్స ఝాన్సీ లక్ష్మి (మాజీ ఎంపీ) "బీచ్ షాక్స్ పేరిట మద్యం షాపుల ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సాగరతీరంలో సీఆర్ జెడ్ (CRZ) పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నా, వాటిని అతిక్రమించి కూటమి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. బీచ్ పొడవునా నివాస సముదాయాలు, గుళ్లు, విద్యాసంస్థలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? ఆర్కే బీచ్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో వచ్చే పర్యాటకులు ఎలాంటి భయం లేకుండా ఆనందంగా గడుపుతున్నారు. అలాంటి చోట మద్యం షాపులు పెట్టి, బీచ్‌లను తాగుబోతులకు అడ్డాగా మారిస్తే.. అర్ధరాత్రి వరకు తాగి, తూగుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి తుగ్లక్ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. గోవాలాంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా వీటిపై స్పష్టమైన నిబంధనలతో చట్టాలు రూపొందించారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు.. బీచ్ లలో మద్యం షాపులు పెట్టి సంపద సృష్టిస్తారా? వైజాగ్ లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూములను అడ్డగోలుగా రూపాయికి, 50 పైసలకు కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పుడు బీచ్‌లపై పడింది. సంపద సృష్టి పేరుతో తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అసౌక్యం కల్పించే మద్యం షాపుల ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైజాగ్ వాసులకు బీచ్ షాక్స్ వద్దు.. ప్రజల ఆరోగ్యాలే ముద్దు." జల్లి సుభద్ర (జిల్లా పరిషత్ చైర్ పర్సన్) "కూటమి నేతలు బీచ్ షాక్స్ పేరుతో మద్యం దుకాణాలను ప్రోత్సహించడం అత్యంత దారుణం. బీచ్ షాక్స్ ఏర్పాటుపై స్థానిక ఎంపీ భరత్ మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని, అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 'మీ ఇంట్లో మహిళలు బీచ్ షాక్స్ ఏర్పాటుకు అంగీకరిస్తారా?' అని నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మహిళా లోకం తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం." సత్యవతి (మాజీ ఎంపీ, అనకాపల్లి) "కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు స్వచ్ఛందంగా కదలివచ్చారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా పిలుచుకునే అత్యంత సుందరమైన, ప్రశాంతమైన విశాఖపట్నంలో బీచ్ షాక్స్ పేరుతో మద్యం షాపులు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని, మహిళల భద్రతను పాడుచేస్తున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ (పాలనా రాజధాని)గా ఏర్పాటు చేయాలని ఆరోజు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే... ఈ కూటమి ప్రభుత్వం మాత్రం వైజాగ్‌ను మద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని చూడటం దుర్మార్గం. పర్యాటకంగా వైజాగ్‌ను అభివృద్ధి చేయడానికి అనేక మార్గాలున్నాయి. అవన్నీ వదిలేసి కేవలం మద్యం ద్వారానే ఆదాయాన్ని సంపాదించాలన్న ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిచోటా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చివరికి బీచ్ లలో కూడా మద్యం ఏరులై పారించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం ఆగదు." గొలగాని హరి కుమారి (మాజీ మేయర్) "కూటమి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్టు షాపులను ఏర్పాటు చేసి మహిళల భద్రతను పూర్తిగా ప్రమాదంలో పడేశారు. ఆ పాపాలు చాలవన్నట్టు ఇప్పుడు మరలా పర్యాటక ప్రాంతమైన బీచ్‌లలో 'బీచ్ షాక్స్' పేరిట బార్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం." కె. భాగ్యలక్ష్మి (మాజీ ఎమ్మెల్యే) "బీచ్ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనే చాలా దుర్మార్గమైంది. బీచ్ షాక్స్ ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. కుటుంబాలతో, పిల్లలతో బీచ్‌లకు వచ్చే సాధారణ ప్రజలకు ఈ మద్యం దుకాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వానికి పాలన చేతగాక చేతులెత్తేసింది." కోలగట్ల శ్రావణి (వైయస్ఆర్‌సీపీ మహిళా విబాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) "కూటమి ప్రభుత్వం మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. విశాఖపట్నాన్ని రాజధాని చేయడానికి వీరికి మనసు రాదు కానీ, దీన్ని గోవాగా మారుస్తానని చంద్రబాబు గారు చెబుతున్నారు. బీచ్ లలో కుటుంబాలతో ఆహ్లాదంగా గడిపే రోజులను భవిష్యత్తు తరాలకు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. బీచ్ షాక్స్ ఏర్పాటు వెనుక తోడల్లుళ్లు అయిన మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్‌లు ఇద్దరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారే తప్ప, భవిష్యత్ తరాలకు జరుగుతున్న నష్టాన్ని మాత్రం అంచనా వేయడం లేదు. ఇవాళ మద్యం అమ్మకాలు అన్న వారు రేపు ఇక్కడే డ్రగ్స్ అమ్మరన్న నమ్మకం ఏముందని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ముగ్గురు పిల్లలను కంటే రూ. 30 వేలు, నలుగురు పిల్లలను కంటే రూ. 40 వేలు ఇస్తామని చెబుతున్నారు.. ఇదేనా చంద్రబాబు గారు మీరు చెప్పే సంపద సృష్టి? పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సింది పోయి.. అభివృద్ధి పేరుతో మద్యం షాపులు ఏర్పాటు చేస్తామంటే మహిళా లోకం సహించేది లేదు. మీ ప్రభుత్వ పతనం తథ్యం." ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ ‘బీచ్ షాక్స్’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పర్యాటక ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటును అడ్డుకుని తీరుతామని నేతలు స్పష్టం చేశారు. మహిళల భద్రతను, ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపద సృష్టిస్తామనడం హాస్యాస్పదమని, ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు.