విజయవాడ: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా విజయవాడ జింఖానా గ్రౌండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ భారతదేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానేత అని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారని అన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. నేటి తరం బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం, సోదరభావం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహానేతల త్యాగాలు, సేవలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (ఎస్ఈసీ), మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు కాలే పుల్లారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్‌కు ఘనంగా నివాళులర్పించారు.