టీటీడీ స్థలాల్లో స్వామివారి చిత్రపటాల నిర్లక్ష్య నిర్వహణ 

ప‌వ‌నానంద‌స్వామి..మీ స‌నాత‌నం ఎలా ఉందో చూడండి

టీటీడీ, విజిలెన్స్ వైఫల్యాలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి 

తిరుపతి: అలిపిరి–జూపార్క్ రోడ్డులోని టీటీడీ స్థలాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాలు, ఫోటోలు అత్యంత నిర్లక్ష్యంగా పడివుండటంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ, విజిలెన్స్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీని పరిరక్షిస్తున్నామని, ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. అలిపిరి సమీపంలోని టీటీడీ స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన ప్రాంతాలు చెత్తకుప్పలను తలపిస్తున్నాయని, అక్కడ వందలాది, వేలాది స్వామివారి చిత్రపటాలు మలమూత్రాల మధ్య, ఖాళీ బీరు సీసాలు, వాడేసిన వస్తువుల మధ్య పడి ఉండటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

తాము టీటీడీ అధికారులు చిత్రపటాలను అక్కడ పడేశారని చెప్పడం లేదని, కానీ టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెబుతున్నామని భూమన స్పష్టం చేశారు. ఇంతటి అపచారం జరుగుతున్నా టీటీడీ ఈవో, పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు, సంబంధిత అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
గత రెండేళ్లుగా టీటీడీ ప్రక్షాళన పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, స్వామివారి చిత్రపటాల పరిరక్షణలో మాత్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. టీటీడీ స్థలాలు భక్తులు వినియోగించిన స్వామివారి చిత్రపటాలను పడేసే డస్ట్‌బిన్‌లుగా మారిపోయాయని, ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల పరిరక్షణ గురించి మాట్లాడే పాలకులు ముందుగా ఇటువంటి ఘటనలపై సమాధానం చెప్పాలని భూమన డిమాండ్ చేశారు. టీటీడీ పరిధిలో జరుగుతున్న ఈ అవమానకర పరిస్థితులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, స్వామివారి చిత్రపటాలకు తగిన గౌరవం కల్పించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. టీటీడీ స్థలాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
 

Back to Top