శ్రీకాకుళం: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను శ్రీకాకుళం జిల్లా జైలు వద్ద పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదాన్ని కావాలనే హత్య కేసుగా మార్చి, 18 ఏళ్ల యువకుడితో పాటు మొత్తం కుటుంబాన్ని వేధించడం అమానుషమని మండిపడ్డారు. ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా, పోలీసులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అప్పలరాజు కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జైలు వద్ద వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మార్చడం ఎంతవరకు ధర్మం? ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదాన్ని కావాలనే కుట్రగా, హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం రాష్ట్రంలో జరుగుతున్న కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైయస్ జగన్ మండిపడ్డారు. నెల రోజుల క్రితమే నీట్ పరీక్ష రాసి, తండ్రిలాగే మంచి డాక్టర్ కావాలని కలలు కంటున్న 18 ఏళ్ల యువకుడిని హత్య కేసులో ఇరికించి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూడడం అమానుషమని అన్నారు. బాధితుడితో ఎలాంటి పరిచయం కూడా లేని ఒక యువకుడిపై కుట్ర, హత్య ఆరోపణలు మోపడం వెనుక రాజకీయ కక్ష తప్ప మరొకటి కనిపించడం లేదని చెప్పారు. 108కు ఫోన్ చేసింది కూడా ఆ యువకుడే.. అయినా హత్య కేసు? యాక్సిడెంట్ జరిగిన వెంటనే 108కు ఫోన్ చేసింది కూడా అదే యువకుడని, బాధితుడిని కాపాడేందుకు తన తండ్రి నుంచి నేర్చుకున్న సీపీఆర్ కూడా చేశాడని వైయస్ జగన్ గుర్తు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం కూడా వారి కుటుంబమే ఇచ్చిందని చెప్పారు. ఎలాంటి చెడు ఉద్దేశం ఉంటే ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రమాదంలో మరణం జరిగితే బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాల్సింది పోయి, దానిని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అప్పలరాజును లక్ష్యంగా చేసుకున్న రాజకీయ కుట్ర అప్పలరాజు వైయస్ఆర్‌సీపీకి చెందిన బీసీ నాయకుడు కావడమే ఈ వేధింపులకు అసలు కారణమని వైయస్ జగన్ అన్నారు. ఒక ప్రమాదాన్ని రాజకీయ కుట్రగా మలిచి మొత్తం కుటుంబాన్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇటువంటి చర్యలు చరిత్రలో కక్షసాధింపు రాజకీయాలకు ఉదాహరణగా నిలిచిపోతాయని హెచ్చరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎల్లో మీడియా–టీడీపీ సోషల్ మీడియా–పోలీసులు.. ఇదే మాఫియా వ్యవస్థ ముందుగా ఎల్లో మీడియాలో కట్టుకథలు రాయించడం, వాటికి మసాలా జోడించి టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయించడం, చివరకు పోలీసులు అదే కథనాలను కేసులుగా మార్చడం రాష్ట్రంలో నడుస్తున్న మాఫియా వ్యవస్థ అని వైయస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీడీపీ సోషల్ మీడియా, ప్రభుత్వం, పోలీసులు కలిసి ఒకే వ్యవస్థలా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో అణచివేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా మారిందన్నారు. యాదవులు, బీసీలపై ప్రేమ ఉంటే చేతల్లో చూపాలి యాదవులపై ప్రేమ ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం, ప్రకాశం జిల్లాలో యాదవులపై దాడి జరిగినప్పుడు బాధితులపైనే కేసులు పెట్టిందని వైయస్ జగన్ గుర్తు చేశారు. విశాఖలో తొలి యాదవ మహిళా మేయర్‌ను వైయస్ఆర్‌సీపీ నియమించిందని, యాదవ భవన్‌కు భూమి కూడా తమ ప్రభుత్వమే కేటాయించిందని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ రద్దు చేశారని విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, వారి సంక్షేమంపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. మత్స్యకారుల సంక్షేమాన్ని కూడా నిర్వీర్యం చేశారు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు పోర్టులు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రారంభించామని వైయస్ జగన్ చెప్పారు. మూలపేట పోర్టు, బూడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ వంటి కీలక ప్రాజెక్టులు తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం వాటిని స్కాముల కోసం వాడుకుంటూ, మత్స్యకారుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖలో సముద్రంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని వైయస్ జగన్ విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగులు అందరికీ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని అన్నారు. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు నిలిచిపోవడంతో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని చెప్పారు. అప్పలరాజు కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది అప్పలరాజు కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టబోమని, అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, న్యాయమే గెలుస్తుందని, అప్పలరాజు త్వరలోనే బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, కక్షసాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు.