అనంతపురం : అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు, గణాంకాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వైయస్ జగన్ హయాంలో 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి పేర్లు మాత్రమే మార్చిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతు భరోసా వంటి ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని, తల్లికి వందనం పథకంలో 22 లక్షల మందిని అన్యాయంగా తొలగించిందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబితే స్వతంత్ర విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం సరికాదని, అలాంటి బెదిరింపులకు వైయస్ఆర్‌సీపీ భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల అమలు కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద నిరసనలు చేపడతామని సాకే చంద్రశేఖర్ ప్రకటించారు.