శ్రీ సత్యసాయి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సి.కె.పల్లి మండలం న్యామద్దల గ్రామం నుంచి హంద్రీనీవా కాలువ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, రాయలసీమకు నీళ్లు అడగడం కాదని, అది ఈ ప్రాంత ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేవలం నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదని, లక్షలాది మంది రైతుల జీవితాలకు భరోసా కల్పించే జీవనాడి అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కరువుతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి ఈ ప్రాజెక్టుకే ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి కృష్ణా జలాలను రాయలసీమకు అందించే దిశగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయని, ఆ పనులను పూర్తి చేసి ఉంటే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ, రాయలసీమ రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. హంద్రీనీవా కాలువల లైనింగ్ పనుల్లో జరిగిన నాసిరకం నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదన్నారు. రాయలసీమకు సాగునీటి న్యాయం జరిగే వరకు, ప్రతి రైతు పొలం పచ్చగా మారే వరకు వైయస్ఆర్‌సీపీ ప్రజలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందని సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ఇది రాజకీయ ఉద్యమం కాదని, రైతుల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమమని పేర్కొంటూ ప్రతి రాయలసీమ బిడ్డ ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, శ్రీమతి దీపిక, ఈర లక్కప్ప, మక్బూల్, మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, జిల్లా కోఆర్డినేటర్ కాంతారాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంజునాథ్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.