విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ నియామకాల్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అదే విధంగా విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, స్వామిదాస్, ఎమ్మెల్సీ రుహుళ్ల, జగ్గయ్యపేట సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.