ప్రతి కార్యకర్తా వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పనిచేయాలి

 సోషల్‌ మీడియాను గ్రామస్థాయి నుంచి ప్రజా ఉద్యమంగా మలచాలి 

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపు

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కీల‌క స‌మావేశం

 తాడేపల్లి: సోషల్‌ మీడియాలో వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కేవలం పార్టీ ప్రచారానికే పరిమితం కాకుండా ప్రజల గొంతుకగా మారాలని, ప్రతి కార్యకర్తా ఒక ‘వన్‌ మ్యాన్‌ ఆర్మీ’లా పనిచేస్తూ వాస్తవాలను పదునైన కంటెంట్‌తో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారిక ఆధారాలతో ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అసభ్య పదజాలం, మార్ఫింగ్‌, ఫేక్‌ కంటెంట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని స్పష్టం చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీ‌హ‌రి, సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర దొడ్డా అంజిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

గ్రామస్థాయి వరకు డిజిటల్‌ నెట్‌వర్క్‌

వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేసి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని నేతలు సూచించారు. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి వేదికలను సమర్థంగా వినియోగించడంతో పాటు యువతను, స్థానిక కంటెంట్‌ క్రియేటర్లను భాగస్వాములను చేస్తూ డిజిటల్‌ వాలంటీర్‌ నెట్‌వర్క్‌ను నిర్మించాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే డిజిటల్‌ వేదికలను ఏర్పాటు చేయాలని సూచించారు. 

డీఎస్సీ, నిరుద్యోగ భృతిపై గళమెత్తాలి

మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగినట్లు పార్టీ పేర్కొంటున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని సోషల్‌ మీడియా వేదికగా బలంగా డిమాండ్‌ చేయాలని నేతలు సూచించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయడంతో పాటు రూ.9,500 కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. 

ప్రతి విమర్శకూ ఆధారం ఉండాలి

ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శకు పాత జీవోలు, అధికారిక పత్రాలు, ఎఫ్‌ఐఆర్‌ కాపీలు వంటి ఆధారాలను జత చేయాలని పార్టీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి సూచించారు. కూటమి నుంచి వచ్చే ప్రచారానికి వేగంగా వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రీల్స్‌, ఇన్ఫోగ్రాఫిక్స్‌, వీడియోలు, వాయిస్‌ క్లిప్‌ల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అయితే ప్రతి పోస్టు రాజ్యాంగ పరిధిలో, చట్టబద్ధంగా, మర్యాదపూర్వక భాషలోనే ఉండాలని స్పష్టం చేశారు. 

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

అక్రమ కేసులు, వేధింపులకు సంబంధించిన వివరాలను ‘డిజిటల్‌ డైరీ’లో నమోదు చేస్తున్నామని నేతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే సోషల్‌ మీడియా కార్యకర్తలను గుర్తించి వారి పనితీరును నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. కేసులు, వేధింపులు ఎదుర్కొనే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రమశిక్షణ, అంకితభావంతో గ్రామస్థాయి నుంచి పార్టీ సోషల్‌ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు. 

గ్రామ స్థాయి నుండి సోషల్ మీడియాను ప్రజా ఉద్యమంగా మలచాలి

- లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి సోషల్ మీడియా కార్యకర్తపైనా అధ్యక్షులు వైఎస్ జగన్ గారికి అపారమైన నమ్మకం, అభిమానం ఉన్నాయి. మిగతా పార్టీల్లో లాగా మిమ్మల్ని కేవలం తెరవెనుక మాత్రమే ఉంచకుండా, పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. పార్టీ ప్రారంభించిన తొలిరోజుల్లో ఏ మీడియా మద్దతు లేకపోయినా, జగనన్న నడిచిన ప్రతి అడుగును ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మన సోషల్ మీడియా వారియర్స్‌దే. 2024లో వేధింపులకు గురిచేసి, కేసులు పెట్టి జైళ్లకు పంపినా మన కార్యకర్తలెవరూ భయపడకుండా పార్టీ కోసమే నిలబడ్డారు. మీలో ఉన్న విశ్వాసం, నమ్మకం, నిబద్ధత, ధైర్యం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల్లోనూ లేవు. ఇప్పుడు మనమందరం ఒక స్పష్టమైన లైన్ తీసుకొని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. డీఎస్సీ నిర్వహణలోని అక్రమాలు, అవినీతి, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో పాటు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మనం గళం విప్పాలి. రాబోయే రోజుల్లో ప్రతి నెలా మీ సోషల్ మీడియా ఖాతాల పనితీరును పరిశీలించి, బాగా కంటెంట్ పెట్టిన వారిని నేరుగా వైఎస్ జగన్ గారితో కలిపిస్తాము. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపుతో పాటు భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీల వంటి గొప్ప రాజకీయ అవకాశాలు దక్కుతాయి. ఈ పోరాటంలో అక్రమ కేసుల్లో ఇరుక్కున్న కార్యకర్తలకు, వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రెండు కాళ్లు లేకపోయినా పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా లాగా, మనం కూడా దృఢమైన సంకల్పంతో పనిచేయాలి. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి డిజిటల్ వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించి సోషల్ మీడియాను ఒక ప్రజా ఉద్యమంగా మలచాలి. ప్రతి మొబైల్ ఫోన్ ప్రజా సమస్యలను నిలదీసే ఆయుధంగా మారి, ప్రతి పోస్ట్ యువత భవిష్యత్తు కోసం వినిపించే స్వరం కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి వైఎస్ జగన్ గారు ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మనమందరం సైనికుల్లా శ్రమించాలి.

ఇక ఎటాకింగ్ మోడ్‌లోకి మారాలి 
- పూడి శ్రీహ‌రి, వైఎస్సార్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి 

సోషల్ మీడియాలో టీడీపీ నెట్‌వర్క్ కంటే మనం కంటెంట్, ఆధారాల విషయంలో చాలా బలంగా ఉన్నాం. వాళ్లు వ్యాప్తి చేసే అబద్ధాలను, నెగెటివ్ నేరేషన్‌ను గుర్తించి మొదటి రెండు గంటల్లోనే వాస్తవ ఆధారాలతో కౌంటర్ ఇవ్వడం మన ప్రధాన వ్యూహం కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 2025 మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, పరీక్షల నిర్వహణలోని పారదర్శకత లోపంపై కేంద్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని మనం గట్టిగా డిమాండ్ చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని, రూ. 9,500 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా నిలదీయాలి. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిరుద్యోగం, అమరావతి రీజనల్ ఇంబ్యాలెన్స్, రైతులకు మద్దతు ధర లేకపోవడం వంటి సమస్యలపై ఆధారాలతో సహా రీల్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, వాయిస్ క్లిప్‌లను తయారు చేయాలి. ఈ కంటెంట్‌ను ఇన్‌స్టా, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్ లలో విస్తృతంగా వైరల్ చేయాలి. మనం కేవలం ప్రతిస్పందించే స్థితి నుంచి అటాక్ చేసే స్థితికి మారి క్రియాశీల‌కంగా ప‌నిచేయాలి. ప్రభుత్వంపై మనం చేసే ప్రతి విమర్శకు పాత జీవోలు, అధికారిక పత్రాలు మరియు ఎఫ్ఐఆర్ కాపీల లాంటి ఆధారాలను జత చేసి ప్రశ్నించాలి. నియోజకవర్గ స్థాయిలో మన సోషల్ మీడియా ఇన్ ఛార్జులు, కార్యకర్తలు ఖచ్చితంగా అన్ని రకాల అధికారిక ఖాతాలను కలిగి ఉండి, క్రమంగా ఆడిట్ చేసుకోవాలి. మన బలం గ్రామ స్థాయి కార్యకర్త. అందుకే క్షేత్రస్థాయి సమస్యలను బయటకు తీసి, గతంలో వైఎస్ జగన్ గారి పాలనలో ప్రజలకు జరిగిన మంచిని, ప్రస్తుత వైఫల్యాలను పోల్చి చూపుతూ కౌంటర్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. జనసేన, ఇతర కూటమి భాగస్వాముల సొంత వైరుధ్యాలను, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టినా రాజ్యాంగ పరిధిలో, చట్టబద్ధంగా, మర్యాదపూర్వక భాషలోనే ఉండాలి తప్ప, అనవసరంగా బూతులు తిట్టడం లేదా మార్ఫ్ చేసిన ఫేక్ కంటెంట్‌ను ప్రచారం చేయకూడదు. ప్రసంగాల ఆధారంగా అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తే బ‌యపడకుండా దాన్ని కూడా ప్రభుత్వ అరాచకంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. మారీచ మార్కు అబద్ధాలను తిప్పికొడుతూ, నిరుద్యోగులు, జన్ జెడ్‌, జన్ ఆల్ఫా యువతకు చేరువయ్యేలా డిజిటల్ కంటెంట్‌ను రూపొందించాలి. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ప్రతి మొబైల్ ఫోన్‌ను వైఎస్ జగన్ గారి ప్రజా పోరాటానికి అత్యంత శక్తివంతమైన డిజిటల్ ఆయుధంగా మలచాలి.

జ‌గ‌న‌న్న విజ‌న్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి
- దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు 

రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకొని ఎవరిపై పడితే వారిపై అక్రమ కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. అమరావతి పేరుతో జరిగే మోసాన్ని ప్రశ్నించినా, చివరకు సోషల్ మీడియాలో సాధారణ ఒపీనియన్ వ్యక్తపరిచినా దేశద్రోహం కింద కేసులు కట్టి ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు లేఖలు రాయడం వారి నిస్పృహను చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా, వ్య‌క్తిత్వ హ‌ననానికి పాల్పడినా భయపడేది లేదు. సొసైటీలో ప్రతి ఒక్కరూ బాగుపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే జగనన్న విజన్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.

Back to Top