విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్ చేయాలి

డీఎస్సీ–2025 నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలి

విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలి

ప్రతి నిరుద్యోగికి 25 నెలల భృతి రూ.75 వేలు చెల్లించాలి

ఆగస్టు 3 నుంచి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, రిలే దీక్షలు

అనంతపురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం : డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ మెరిట్ లిస్ట్‌తో పాటు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో బేరసారాలు జరిగినట్లు చెబుతున్న వీడియోతో కూడిన పెన్‌డ్రైవ్‌ను జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు.

మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ

ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నిరుద్యోగ యువత కల. ఆ కలను చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఛిద్రం చేశారు. మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి అర్హులను పక్కనపెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో ప్రజల ముందు ఉంచారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

చర్చల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్

డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా నారా లోకేష్‌తో పాటు అధికార పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లోకేష్ చర్చకు రావాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతిపై ఇప్పటికే యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాం. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఆధారాలతో కూడిన వినతిపత్రాలు అందజేస్తున్నాం.

పేపర్ తయారీలో పనిచేసిన వ్యక్తికే టాప్ ర్యాంకా?

ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో ప్రమేయం ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు పరీక్షలో టాప్ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత అతని పేరు మెరిట్ జాబితాలో లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలి. టీచర్ పోస్టు కోసం బేరసారాలు జరిగినట్లు చెబుతున్న వీడియోను కూడా పెన్‌డ్రైవ్‌లో జాయింట్ కలెక్టర్‌కు అందజేశాం. దీనిపైనా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి.

లోకేష్‌ను బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ జరపాలి

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్ చేయాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలి. అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర విచారణకు సిద్ధం కావాలి.

రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు చెల్లించాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించి రూ.9,500 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వాటిని తక్షణమే విడుదల చేసి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించాలి.

ప్రతి నిరుద్యోగికి రూ.75 వేలు ఇవ్వాలి

ఎన్నికలకు ముందు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం గడిచిన 25 నెలలకు ఒక్కో నిరుద్యోగికి రూ.75 వేల చొప్పున బకాయిలతో సహా చెల్లించాలి.

ఆగస్టు 3 నుంచి ఉద్యమం మరింత ఉధృతం

డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, రిలే దీక్షలు చేపట్టి పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.
 

Back to Top