పార్వతీపురం: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ నేతలు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. డీఎస్సీపై సీబీఐ విచారణ ఎందుకు జరపరు? మెగా డీఎస్సీ పేరుతో 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టగా, నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడింగ్, డిజిటల్ నిర్వహణ వంటి అత్యంత గోప్యమైన ప్రక్రియల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని భాగస్వాములను చేయడం పేపర్ లీకేజీ ఆరోపణలకు తావిచ్చిందన్నారు. ప్రశ్నపత్రాల వ్యవస్థలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించడం, అనంతరం అతని పేరును మెరిట్ జాబితా నుంచి తొలగించడం వంటి అంశాలపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిబంధనలను మార్చి రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. గతంలో 2 శాతంగా ఉన్న స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచి, జీవో నెం.4, 47 ద్వారా పోటీ పరీక్షను తొలగించారని పేర్కొన్నారు. నియామకాలు పూర్తయ్యాక ఆ జీవోలను రద్దు చేసి, జీవో నెం.56 ద్వారా తిరిగి పోటీ పరీక్షను తప్పనిసరి చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను పక్కనపెట్టి, జిల్లా, యూనివర్సిటీ స్థాయి సర్టిఫికెట్లతో కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో ఆధారాలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వం డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. లోకేష్ రాజీనామా చేయాలి దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఉపాధ్యాయ నియామకాల్లో ఒక్క అక్రమం జరిగినా విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని నేతలు పేర్కొన్నారు. డీఎస్సీ–2025లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు చెల్లించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయని నేతలు పేర్కొన్నారు. తమ లెక్కల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.6,200 కోట్లు, వసతిదీవెన కింద రూ.3,300 కోట్లు కలిపి మొత్తం రూ.9,500 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయని, మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా ఇవ్వాలి ఎన్నికల సమయంలో ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. నిరుద్యోగులకు రావాల్సిన భృతిని బకాయిలతో సహా చెల్లించి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా పరిశీలకుడు శరగడం చిన్న అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పల్లా అనంత్ నాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బోతాడ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.