డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి అమలు చేయాలి

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల వినతిపత్రం

జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన

నంద్యాల: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.

డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన పోరాటంలో భాగంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అమలు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

డీఎస్సీపై స్వతంత్ర విచారణ జరపాలి

ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఉపాధ్యాయ నియామకాల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి.

లోకేష్ నైతిక బాధ్యత వహించాలి

డీఎస్సీ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. నియామకాల్లో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలి. విద్యార్థుల చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకోవాలి.

నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏది?

ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతిని వెంటనే అమలు చేయాలి. యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి.

విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున పోరాటం

డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, నిరుద్యోగులకు భృతి వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వారి తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’’ అని కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top