తాడేపల్లి: కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి వైయస్సార్‌సీపీపై, గత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. అసెంబ్లీలో తనను అవమానించారని చెబుతున్న భువనేశ్వరి, ప్రస్తుతం తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున అసెంబ్లీ రికార్డులను బయటపెట్టి ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరిపై వైయస్సార్‌సీపీ ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆమెను ఉపయోగించుకున్నది చంద్రబాబు, లోకేష్‌లేనని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ధర్మపత్నిగా తనపై, విజయమ్మతో పాటు వైయస్సార్‌సీపీ మహిళా నేతలపై ఐటీడీపీ ద్వారా జరుగుతున్న అసభ్యకర ట్రోలింగ్‌ను సాటి మహిళగా భువనేశ్వరి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపైనా స్పందించాలని కోరారు. చంద్రబాబు ‘మాట ఇస్తే తప్పరు’ అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్య ఈ ఏడాది అతిపెద్ద జోక్ అని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సహా పలు హామీల అమలు ఏమైందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకులు ఎన్టీఆర్, వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని, స్వాగతిస్తామని లక్ష్మీ పార్వతి తెలిపారు. అయితే ప్రజల్లోకి వచ్చే ముందు చంద్రబాబు, లోకేష్ పాలనలో జరుగుతున్న అరాచకాలు, రెడ్‌బుక్ రాజకీయాలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అవమానం, చంద్రబాబు నిజాయితీపై తాను సంధించిన ప్రశ్నలకు భువనేశ్వరి సూటిగా సమాధానం చెప్పాలని లక్ష్మీ పార్వతి సవాల్ చేశారు.