కోడుమూరు: వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేనేత కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం లభించిందని, చేనేత రంగానికి అది నిజమైన స్వర్ణయుగంగా నిలిచిందని కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కోడుమూరు మండల కేంద్రంలో చేనేత కార్మికులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. చేనేత కార్మికుల ఆహ్వానం మేరకు కర్నూలు పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ముఖ్య అతిథులుగా హాజరై చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు నాయకులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన చేనేత సంక్షేమ దిశను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరింత బలోపేతం చేశారని తెలిపారు. వైఎస్ జగన్ పాలనలో చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రత్యక్ష లబ్ధి కార్యక్రమాల ద్వారా చేనేత రంగానికి స్వర్ణయుగం వచ్చిందన్నారు. చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారి జీవనోపాధి మెరుగుపడేలా అనేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, వేలాది కుటుంబాల జీవనాధారమని డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ సమస్యలు, ముడిసరుకు ధరల పెరుగుదల వంటి ఇబ్బందుల నుంచి చేనేత కార్మికులను గట్టెక్కించేందుకు ప్రత్యేక విధానాలు అవసరమని చెప్పారు. చేనేత రంగానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించి, యువత కూడా ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుట్టా రేణుక మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత పరిశ్రమ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. చేనేత కార్మికుల కళా నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ రంగాన్ని పరిరక్షించి మరింత బలోపేతం చేయడం సమాజం, ప్రభుత్వాలందరి బాధ్యత అని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా వినియోగించడం ద్వారా వేలాది కుటుంబాలకు అండగా నిలవవచ్చని పిలుపునిచ్చారు. అనంతరం చేనేత కార్మికులను శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ పరిశ్రమను కాపాడాలని, ప్రతి కుటుంబం చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.