చేనేత రంగానికి గత ప్రభుత్వంలో ధీమా

చేనేత రంగాన్ని ఆదుకున్నది నాడు వైయస్సార్‌

ఆ తర్వాత జగన్‌గారే. పక్కాగా నేతన్న నేస్తం అమలు

50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చింది నాడు వైయ‌స్సార్‌గారే 

వైయస్సార్‌సీపీ నాయకుల వెల్లడి

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

నేతన్నకు జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లు అండగా నిలిచింది

స్వయంగా నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నారు

వెన్నుపోటు కూటమి పాలనలో నేతన్నల బతుకులు రోడ్డున పడ్డాయి

ఎన్నికల హామీలు ఇప్పటికీ అమలు కాలేదు

ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు కూడా తగ్గిపోయింది

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరుపై పార్టీ నాయకుల ఆగ్రహం  

తాడేపల్లి:  రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి నాడు వైయస్సార్‌గారు, ఆ తర్వాత ఆయన తనయుడు శ్రీ వైయస్‌ జగన్‌గారి ప్రభుత్వమేనని, వారిద్దరూ చేనేత రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత కార్మికుల హక్కులు, వారి జీవనోపాధి పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
    ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్‌ హయాంలో చేనేత కార్మికులకు పింఛన్లు, గృహాలు, ముడి సరుకులపై సబ్సిడీలు, పన్ను రాయితీలు కల్పించారని గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా సమయంలో ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించి వేలాది కుటుంబాలకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం వెన్నుపోటు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చేనేత ఉత్పత్తుల కొనుగోలు పెంచి, ఆప్కోను బలోపేతం చేసి, పెండింగ్‌ సబ్సిడీలు విడుదల చేయాలని కోరారు.
    చేనేత రంగాన్ని కాపాడటం అంటే గ్రామీణ ఉపాధిని, భారతీయ సంస్కృతిని కాపాడటమేనని నాయకులు స్పష్టం చేశారు. చివరగా చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. 
కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ గారిదే.
:చిల్లపల్లి మోహన్‌రావు, ఆప్కో మాజీ చైర్మన్‌

– చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మాత్రమే కాదు, చేనేత కుటుంబాల జీవితాలు కూడా ఘనంగా ఉండేలా ప్రభుత్వాలు పని చేయాలి. డాక్టర్‌ వైఎస్సార్‌ గారు చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, ఇళ్ల నిర్మాణం, ముడి సరుకులపై రాయితీలు వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ’నేతన్న నేస్తం’ ద్వారా ఐదేళ్లపాటు ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు. కరోనా సమయంలో ఆప్కో ద్వారా మాస్క్‌ క్లాత్‌ కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకున్నారు. చేనేత రంగాన్ని నిజంగా ఆదుకున్న ప్రభుత్వాలు వైఎస్సార్, జగన్‌ ప్రభుత్వాలేనని చరిత్ర చెబుతోంది.

పెండింగ్‌ సబ్సిడీలను విడుదల చేసి నేతన్నను ఆదుకోవాలి 
:మురుగుడు హన్మంతరావు, ఎమ్మెల్సీ

– చేనేత పరిశ్రమను కాపాడాలంటే ముందు చేనేత కార్మికుడిని కాపాడాలి. డాక్టర్‌ వైఎస్సార్‌ గారు యారన్, రంగులు, రసాయనాలు, సిల్క్‌పై సబ్సిడీలు పెంచి చేనేతకు ఊపిరి పోశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్‌ అందించిన ఘనత ఆయనదే. ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సహాయం ఇచ్చి చేనేత కుటుంబాలకు భరోసా కల్పించారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. మిల్లుల పోటీని తట్టుకునేలా చేనేత రంగానికి ప్రభుత్వ అండను పెంచారు. వైఎస్‌ జగన్‌ గారు ’నేతన్న నేస్తం’ ద్వారా ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున ఐదేళ్లు ఆర్థిక సహాయం అందించారు. ఆ పథకం వల్ల వేలాది కుటుంబాలు నిలదొక్కుకున్నాయి. చేనేత కార్మికులు స్వయంగా నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నారు. కానీ రెండున్నర సంవత్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు కూడా తగ్గిపోయింది. చేనేత కార్మికుల ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే పరిరక్షించాలి. పెండింగ్‌ సబ్సిడీలను విడుదల చేసి పరిశ్రమను బలోపేతం చేయాలి. చేనేత రంగాన్ని కాపాడటమే వేలాది కుటుంబాల భవిష్యత్తును కాపాడటమే.

నేతన్నకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది
:లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

– చేనేత రంగం భారతీయ సంస్కృతి, స్వావలంబనకు ప్రతీక. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ గారి ప్రభుత్వమే. ఆప్కోను బలోపేతం చేసి చేనేత ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించింది కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. చేనేత కార్మికులు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చేనేత రంగానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. 

    ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డితో పాటు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

 

Back to Top