తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వాటికి పరిష్కారం చూపకుండా కేబినెట్ భేటీల్ని సైతం మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను దూషించడానికే వాడుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గతంలో జరిగిన కేబినెట్ భేటీల తరహాలోనే ఈసారి కూడా జగన్గారిని తిట్టడానికే కేబినెట్ పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. నిన్న పార్లమెంట్ లో పోలవరం ఎత్తు పెంపుపై ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చిందని, ఎత్తు తగ్గింపు వల్ల జరుగుతున్న నష్టంపై కేబినెట్లో ఎందుకు చర్చించలేకపోయారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రెస్ మీట్లో కన్నబాబు ఇంకేమన్నారంటే..: ఈ రాష్ట్రానికి అసలు ఎవరు సీఎం?: రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన శ్రీ వైయస్ జగన్ను ఎలా అడ్డుకుందాం అనే ఎజెండాతో నిన్న క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. లోపల చంద్రబాబు కేబినెట్ మీటింగ్కు అధ్యక్షత వహిస్తే, బయట ఆయన కుమారుడు లోకేష్ అధ్యక్షత వహించారు. సెక్రటేరియట్లో క్యాబినెట్ భేటీ కన్నా ముందు మంత్రులతో ఓ షాడో మీటింగ్ పెట్టారు. ఏదో కాసేపు మాట్లాడుకుని కాఫీ తాగి, అక్కడి నుంచి వెళ్లారు. ఇదంతా చూస్తుంటే అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రానికి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? క్యాబినెట్ మీటింగ్ కన్నా ముందు షాడో మీటింగ్ పెట్టి, లోకేష్ గారు దిశా నిర్దేశం చేస్తున్నారంటే, ఏంటి ఈ స్పెషాలిటీ అని అడుగుతున్నాం. పాలనా పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయా? లేవా? పూర్తిగా ఆయన తనయుడికి అప్పజెప్పేశారా, అనధికారికంగా? ఏం జరుగుతోంది అనేది రాష్ట్రానికి తెలియాలి. క్యాబినెట్ భేటీలోనే చంద్రబాబు సీఎం: ఇదేదో వైఎస్సార్సీపీకి వచ్చిన అనుమానం కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే అనుమానం వస్తుంది. గతంలో ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ జరిగితే, దానికన్నా ముందు ఒక టీ ఇచ్చి, లేకపోతే ఒక బ్రేక్ఫాస్ట్తో, లేకపోతే ఇంకోటి పెట్టుకుని, ముఖ్యమంత్రులే కలవడం అనేది ఆనవాయితీ. కానీ లోపల ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ కు అధ్యక్షత వహిస్తే, బయట ఏమో షాడో మీటింగ్కి ఆయన కొడుకు లోకేష్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ ఒక్క విషయం చాలు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో మనం చెప్పడానికి. పెరిగిపోతున్న చంద్రబాబు ఫ్రస్టేషన్: క్యాబినెట్ అయినా ఇంకే మీటింగ్ అయినా సింగిల్ పాయింట్ ఎజెండా అమలు చేస్తున్నారు. అదే జగన్గారి మీద దుమ్మెత్తిపోయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వైఎస్సార్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదే ఎజెండా తప్ప ఎక్కడ వేరే అంశాన్ని ప్రజలకి పనికొచ్చే అంశాన్ని వీళ్ల మాట్లాడుతున్నట్టుగా కనిపించదు. ఈ రాష్ట్రంలో ఏదో రాచరిక పాలనలా ఉంది. నోరెత్తితే కేసులు, ఎవడూ ప్రశ్నించకూడదు. ఈ మధ్య క్యాబినెట్ మీటింగ్లకి డిప్యూటీ సీఎం కూడా వెళ్లట్లేదని వింటున్నాం. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతోందో అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా చంద్రబాబుకు తన కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశం ఏముంటే, ఎల్ బోర్డు తగిలించి వదిలేసినట్టుగా వదిలేస్తే కుదరదు, యాక్సిడెంట్లు అవుతాయి. మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇంట్లో ఇచ్చుకుని, మీ సీటు తర్వాత ఆయనకి ఇచ్చుకోండి కావాలంటే. అంతే తప్పించి మొత్తం అంతా పగ్గాలన్నీ ఆయన చేతిలో పెట్టి, తండ్రి కొడుకు చేతిలో పెట్టి, మీరు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, గొడ్డలి పార్టీ అని ఇంకోటి అని మాట్లాడడానికి తప్ప వేరే పని ఏం చేయట్లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు వాడుతున్న భాష, మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయన ఎందుకింత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాకు అర్థం కావట్లేదు. ఈ ఫ్రస్ట్రేషన్కు కారణం ఏంటంటే జగన్. ఇవాళ జగన్గారు బయటికి వెళ్తే, జనం ఎలా వస్తున్నారో చూసారా? జనం ఒక ప్రభంజనం లాగా వస్తున్నారు. ఇంకా రెండేళ్ళు అవ్వలేదు ఆయన అధికారం కోల్పోయి. ఎందుకు వస్తున్నారు అంటే ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని వదులుకుని తప్పు చేశాం జగనన్న అని పెద్ద నినాదం లాగా ఒక ప్రవాహం లాగా ఆయన ముందు వస్తున్నారు. కానీ దీన్ని తట్టుకోలేక చంద్రబాబు దగ్గర నుంచి టీవీ ఫైవ్లో సాంబశివరావు దాకా ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ప్రశ్నించే వాళ్లంతా బ్లేడ్ బ్యాచ్ అంటారా?: ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే, జెడ్ కేటగిరీ ఉన్న ఆ నాయకుడు దేవరపల్లి వస్తే, పోలీసుని కూడా పెట్టకుండా ఏం చేయాలని? అంటే అక్కడ ఏదైనా తొక్కిసలాటో, అవాంచనీయ సంఘటనలు జరిగితే ఆ బురద అంతా జగన్ మోహన్ రెడ్డి గారి మీద చల్లి, ఒక అరాచకం జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేద్దాం అని. ఇప్పుడే కాదు జగన్గారు పల్నాడు వెళ్తే, గుంటూరు వెళ్తే గంటలు గంటలు పట్టింది. వీళ్లందరూ కూడా మీరు చెప్పినట్టుగా కిరాయి మనుషులు అనుకుంటున్నారా? జగన్ గారిని ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు గుండెల్లో పెట్టుకున్న వాళ్లు. ఎందుకు వాళ్లని చూసి ఆ వేదనలో, రోదనలో జగన్ మోహన్ రెడ్డి గారి యాత్రలను చూస్తే మీకు నిత్యం వేదన, రోదన, మీ ఫ్రస్ట్రేషన్. చివరికి జెన్ జీ ఇప్పుడు ఒక ట్రెండింగ్ వర్డ్. ఈ తరం ఈ కొత్త తరం దీన్ని జెన్ జీ అంటున్నారు. ఈ తరాన్ని పట్టుకుని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? ఈ తరం అంతా గంజాయి బ్యాచ్. జగన్ మోహన్ రెడ్డి గారిని చూడడానికో, ఆయన్ని కలవడానికో వెళ్ళిన వాళ్లందరూ కూడా బ్లేడ్ బ్యాచ్లా. మరి మీ దగ్గర ఉన్న వాళ్లంతా హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ దిగి వచ్చిన స్వామీజీలా. ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే జగన్ మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి యూత్ వస్తే కూడా నువ్వు తట్టుకోలేక వాళ్లందరిని కూడా బ్లేడ్ బ్యాచ్లని, వాళ్లందరిని కూడా ఒక తరాన్ని అవమానిస్తున్నారు. అంటే, రోడ్డు మీదకి వచ్చి గొంతెత్తిన ప్రతివాడు బ్లేడ్ బ్యాచీని ప్రతివాడుని గంజా బ్యాచీనా? పారిశ్రామికవేత్తలకు సున్నా వడ్డీ రుణాలా!: నిన్న కేబినెట్లో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారంట. అది పీపీపీ. దీని కోసం కొత్తగా ఆమ్నీ బస్ అంట. ఆమ్నీ బస్ అంటే ఏంటంటే పోరŠుట్ల, విమానాశ్రయాలు, రవాణా, విద్యా, వైద్యం, పరిశ్రమలు, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం, ఇన్నీ రంగాలని కూడా పిపిపి కింద ఇచ్చేస్తారంట. ఇంకేం మిగిల్చారు స్వామి? మీరు ఒక ప్రభుత్వాన్నే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ చేయలేదు. అన్ని చేసినట్టే. స్కూళ్లు ఇచ్చేస్తారు, విద్యారంగం ఇచ్చేస్తారు, వైద్యరంగం ఇచ్చేస్తారు, టూరిజం ఇచ్చేస్తారు, ఇంకేం మిగులుద్ది అనుకుంటున్నారు? పైగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంట. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా రాని ఆలోచనలు ఈ ప్రభుత్వానికి వస్తాయి. అలాగే పారిశ్రామిక వేత్తలకి వడ్డీ లేని రుణాలు ఇస్తారంట . జగన్గారు మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు. వీళ్లు కార్పొరేట్లకి, పారిశ్రామిక వేత్తలకి ఇస్తారంట!. ఈ ఒక్కటి సరిపోదా? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబుకు మధ్య తేడా చెప్పడానికి. అసంబద్ధ విధానాలు. తప్పుడు నిర్ణయాలు: ఎల్నినో వల్ల మొత్తం నష్టం జరిగిందని కేబినెట్లో అంటున్నారు. చెప్తున్నారు. 58 లక్షల ఎకరాల్లో సాగు జరగట్లేదు అంటున్నారు. కానీ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక మీద గాని, కోనసీమలో క్రాప్ హాలిడే గురించి కానీ చర్చించారా? విశాఖపట్నంలో మురికివాడల అభివృద్ధి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట!. మురికివాడలని కూడా పీపీపీలో చేస్తారంట వీళ్ళు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? దిశ వ్యవస్థను గత ప్రభుత్వంలో జగన్గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి, మూడు వారాల లోపు శిక్ష పడే స్థాయికి తయారు చేయాలని అంటే, అది అవసరమే లేదని చెప్పి రద్దు చేస్తారా? పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి, బూడిదే ఇవ్వలేనోళ్ళు మీరు దిశా చట్టం మాత్రం ఉంటే ఏంటి ఉపయోగం? లేకపోతే ఏంటి? అక్కడ ఎక్కడో గంగమ్మ అనే ఆమె స్టేషన్ కి వెళ్లి, ఇవాల్టి వరకు కనబడట్లేదు. ఇంక మీ దిశా చట్టం ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? మీ ప్రభుత్వానికి దిశ లేదు, దశ లేదు. పోలవరం ఊసెత్తని కేబినెట్ భేటీ: నిన్న క్యాబినెట్ లో పోలవరం గురించి ఏమైనా చర్చిస్తారేమో అని చూశాం. మా ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ఓ ప్రశ్న వేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనానికి ఒక పెద్ద రిజర్వాయర్ గా ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు బ్యారేజ్ గా మిగిలిపోయింది. మిధున్ రెడ్డి గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా పార్లమెంట్లో జలశక్తి మంత్రి చెప్పిన సమాధానం ఇది. 41.15 మీటర్ల ఎత్తుకు మార్చేశారు. దీనికి 12,157.53 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదే కేంద్రం ఇచ్చేది. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, తరతరాల కల అది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన కల, కల నెరవేర్చడం కోసం యుద్ధ ప్రాధిపతికిన జలయజ్ఞం ప్రారంభిస్తే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్తే, మీరు ఒక ప్రాజెక్ట్ ని బ్యారేజ్ గా మార్చేశారు. అయినా వీళ్లకు ఏమీ పట్టట్లేదు. పోలవరం రిజర్వాయర్ చేపడితే, 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. మొత్తం 30.44 లక్షల ఎకరాలకి నీరు అందాల్సింది. ఇప్పుడు వీళ్ళ నిర్వాహకం వల్ల కొత్తగా ఇప్పుడు సుమారు 1,89,000 ఎకరాలకు మాత్రమే నీరు వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ని మాత్రం ముంచేస్తున్నారు. దీనిపై నిన్న కేబినెట్లో ఎందుకు చర్చించలేదు? మీరు క్యాబినెట్ లో మీరు దీన్ని బ్యారేజ్ గానే ఉంచేద్దాం అనుకుంటున్నారా? రిజర్వాయర్ స్థాయికి పెంచాలనుకుంటున్నారా? పెంచాలంటే మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? ఆయికట్టు స్థిరీకరణ ప్లాన్లు ఏంటి? దీనికే దిక్కులేదు. మాట్లాడితే బనకచర్లకు లింక్ చేస్తేమని కబుర్లు చెప్తారు. గతంలో ఆల్మట్టి విషయంలోనూ కర్నాటక ఎత్తు పెంచేస్తుంటే చంద్రబాబు అడ్డుకోలేక రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు దీని మీద మాట్లాడట్లేదని అడుగుతున్నాం. ఇప్పటికే గేట్లు పెట్టేసారు, స్పిల్ వే పూర్తి అయిపోయింది. మీ ప్రభుత్వానికి ప్రాధాన్య రంగం ఏంటి? వ్యవసాయమా? విద్య, వైద్యమా? ఏది మీ ప్రాధాన్య రంగం? ప్రెస్ మీట్లు పెడతారు, బూతులు తిడతారు, క్యాబినెట్ పెడతారు, బూతులు తిడతారు, ఎంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ ఆయన తిట్టుకుంటూ రోజులు గడిపేద్దాం అనుకుంటున్నారు? అమరావతిలో క్వార్టర్ట్స్ పూర్తికే పదేళ్లు పట్టింది: అలాగే అమరావతి దాదాపుగా పూర్తి కావస్తుంది. అద్భుతం! అమోఘం! అని రోజు మంత్రులు వెళ్లి బాకాలు ఊదుతున్నారు. తీరా చూస్తే పదేళ్ల క్రితం మీరు మొదలుపెట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్ మంత్రుల క్వార్టర్స్, జడ్జిల కోసం క్వార్టర్స్, ఐఏఎస్, ఐపిఎస్ ల కోసం కడుతున్న క్వార్టర్స్ నిర్మాణం ఇప్పుడు పూర్తవుతున్నాయి. ఈ కట్టడానికి మీకు ఒక దశాబ్దం పట్టింది. మీ మహానగర నిర్మాణంలో ఇదొక గొప్ప ఘట్టం. దీన్ని ఓపెనింగ్, దీని తాళాలు అప్పచెప్పడం, దానికి ఒక పెద్ద ఫంక్షన్, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారని మీడియాలో చూసాం. కానీ మీరు కట్టిన దగ్గర పొద్దున లేసి టూత్ పేస్ట్ కావాలన్నా, సాయంత్రం ఏదైనా ఒక టాబ్లెట్ కావాలన్నా విజయవాడ రావాలి. అమరావతిని లక్ష ఎకరాలకు చేర్చారు. రెండు లక్షల కోట్లు పెట్టుబడులు కావాలంటున్నారు. జగన్గారు మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కలిపి ఒక ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి మనం డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అదే మహానగరంగా ఎదుగుతుందని చెప్పారు. దాన్ని పట్టుకొని బూతులు తిట్టారు, దుర్భాషలాడారు. ఇప్పుడు 29 గ్రామాలు కాదు, రాజధాని అంటే విజయవాడ, అమరావతి, గుంటూరు అంటున్నారు. మీరు చెప్పినట్టుగా విజయవాడ, అమరావతి, గుంటూరు మధ్యన రాజధాని అయితే, 30 కిలోమీటర్ల దూరంలో రెండో ఎయిర్పోర్ట్ ఎందుకు? ఈ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయొచ్చుగా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఇంకొక 5 వేల ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకు? విజయవాడ రైల్వే స్టేషన్ ని డెవలప్ చేయొచ్చు కదా? మళ్ళీ 1500 ఎకరాలతో మరో కొత్త రైల్వే స్టేషన్ ఎందుకు? ఈ అమరావతికి ఇంత గొప్ప పబ్లిసిటీ చేస్తున్నారు కదా? మీ పబ్లిసిటీలో మీకు ఏమైనా డెడ్ లైన్స్ ఉన్నాయా?. ఈ టైం కి రైతులకి భూములు పూలింగ్ కి ఇచ్చిన రైతులకి మేము ప్లాట్స్ వెనక్కి ఇస్తామనో, లేకపోతే ఈ టైం కి ఆ భూములు ఇచ్చిన రైతుల్ని మేము ఆదుకుంటామనో, అంటే ప్రజల వైపుకి, ప్రజల పక్షాన ఆలోచించే డెడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే, రద్దు చేసేసారు కదా? మరి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు అక్కడ ఏదైనా చోటు ఉందా అని కన్నబాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.