తాడేపల్లి: మహిళలకు రక్షణ కవచంలా నిలిచిన చారిత్రాత్మక ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని, దిశ బిల్లుకు అనుగుణంగా మహిళల రక్షణ వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకురావాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం డిమాండ్ చేసింది. మహిళల భద్రత కోసం వైయస్ఆర్‌సీపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేసింది. నిరసన కార్యక్రమాల్లో వైయస్సార్‌సీపీ మహిళా నేతలు మాట్లాడారు. ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడారంటే.. - కురుపాంలో మాజీ మంత్రి పుష్పశ్రీ వాణి మహిళల భద్రత కోసం రూపొందించిన దిశా చట్టాన్ని రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దురదృష్టకరం. మహిళల రక్షణ కోసం చట్టాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటిని రద్దు చేయడానికి ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించడం మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. దిశా చట్టం కేవలం ఒక పేరు కాదు, మహిళలకు త్వరితగతిన న్యాయం అందించేందుకు రూపొందించిన సమగ్ర భద్రతా వ్యవస్థ . దిశా చట్టంలో భాగంగా దిశా యాప్, జీరో ఎఫ్‌ఐఆర్, ప్రత్యేక దిశా పోలీస్ స్టేషన్లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, వేగవంతమైన దర్యాప్తు వంటి వ్యవస్థలను జగన్ ప్రభుత్వం అమలు చేసింది. మహిళలపై నేరాలు జరిగిన వెంటనే స్పందించే విధంగా ఎస్‌ఓఎస్ సేవలు, ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్ విధానం, తక్కువ సమయంలో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసే వ్యవస్థ ద్వారా అనేక మంది మహిళలకు న్యాయం జరిగింది. - హోంమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటనలకు స్వచ్ఛందంగా హాజరవుతున్న రైతులు, ప్రజలను అవమానించేలా మాట్లాడడం సరికాదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలను అణచివేయడం, ప్రతిపక్ష కార్యక్రమాలను భంగపరచడం ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తోంది. ఆలూరు ఘటనపై విచారణ పూర్తికాకముందే హోంమంత్రి ఏకపక్ష వ్యాఖ్యలు చేయడం తగదు. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థల నివేదికలు లేకుండానే వ్యక్తులపై ఆరోపణలు చేయడం హోంమంత్రి పదవికి తగినది కాదు. విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, అంతకుముందే తీర్పు చెప్పడం బాధ్యతాయుతమైన పరిపాలన కాదు. - ‘దిశ’ బిల్లు దేశానికే ఆదర్శంగా నిలిచింది: నెల్లూరులో కాకాణి పూజిత, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళల భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా భావించి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లు దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం, ప్రత్యేక కోర్టులు, మహిళా పోలీసు వ్యవస్థ, దిశ యాప్, జీరో ఎఫ్‌ఐఆర్, ఎస్‌వోఎస్ సేవలు వంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు దిశ బిల్లు నాంది పలికింది. ప్రమాదంలో ఉన్న మహిళలు దిశ యాప్‌లోని ఎస్‌ఓఎస్ ఫీచర్‌ను ఉపయోగించిన వెంటనే 15 నుంచి 20 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ కల్పించే విధానం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు, ఆధునిక ఫోరెన్సిక్ వ్యవస్థ, నిరంతర పర్యవేక్షణతో మహిళలకు భరోసా కల్పించారు. - మహిళల భద్రత పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి: తిరుపతిలో గీతాయాదవ్, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళలపై నేరాల దర్యాప్తు వేగవంతమై, అత్యాచారం, పోక్సో వంటి కేసుల్లో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. గుంటూరులోని రమ్య హత్య కేసులో నిందితుడిని వేగంగా అరెస్టు చేసి, త్వరితగతిన విచారణ పూర్తి చేసి మరణశిక్ష విధింపజేయడం దిశ వ్యవస్థ సమర్థతకు నిదర్శం. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, దిశ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా మహిళల భద్రత పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని బయటపెట్టుకుంది. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై నేరాలు పెరుగుతున్న సమయంలో మహిళల రక్షణ వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.