విశాఖ:విశాఖలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మహిళల భద్రత కోసం దేశంలోనే ఆదర్శంగా నిలిచిన దిశ వ్యవస్థను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టానికి ఆమోదం పొందేలా చేయాల్సింది పోయి, మహిళల రక్షణనే గాలికొదిలేసిందని మండిపడ్డారు. అవసరమైతే దిశ చట్టానికి పేరు మార్చైనా అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆమె, మహిళల భద్రత విషయంలో పూర్తిగా విఫలమైన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీడియాతో వరుదు కళ్యాణి ఏమన్నారంటే... - దిశ వ్యవస్థను రద్దు చేయడం మహిళల భద్రతకు ద్రోహం మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడుల కేసుల్లో 21 రోజుల్లోనే దర్యాప్తు, విచారణ పూర్తి చేసి శిక్షలు అమలయ్యేలా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిశ వ్యవస్థను రూపొందించి కేంద్రానికి పంపింది. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించి ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కానీ ఆ పని చేయకుండా చట్టాన్నే రద్దు చేయడం మహిళల భద్రతను గాలికొదిలేయడమే. మహిళల రక్షణ కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఇది." - జగన్‌కు పేరు వస్తుందనే భయంతోనే నిర్ణయం దిశ యాప్‌ను శక్తి యాప్‌గా, దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చిన ప్రభుత్వం, అవసరమైతే దిశ చట్టానికి కూడా పేరు మార్చి అయినా అమలు చేయాల్సింది. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే కారణంతో చట్టాన్నే రద్దు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోటి 51 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. సుమారు 3,200 మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ద్వారా మహిళల భద్రతకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. - 'అనిత.. ఇంట్లో మమ్మీ.. హోం మినిస్టర్‌గా డమ్మీ' ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళల భద్రతకు అత్యంత కీలకమైన దిశ వ్యవస్థను రద్దు చేయడాన్ని సమర్థించడం అత్యంత దురదృష్టకరం. 'అనిత.. ఇంట్లో మమ్మీ.. హోం మినిస్టర్‌గా డమ్మీ' అనే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. మహిళలపై నేరాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దిశ చట్టం రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. హోం మంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి.