కోడుమూరు: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కోడుమూరులో వైయస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. యువజన నాయకులు సోమశేఖర్‌రెడ్డి, ఎంకే వెంకటేష్, సాయి ముఖేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలకు కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై నిజాలు వెలుగులోకి రావాలి ఈ సందర్భంగా బుట్టా రేణుక, డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామకాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారంలో రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని వారు కోరారు. ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్న యువతకు అన్యాయం జరిగితే వైయస్సార్‌సీపీ మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది యువతకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు వైయస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని బుట్టా రేణుక, డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.