నేతన్నల సంక్షేమానికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది

ప్రస్తుత ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని విమర్శ

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైయస్ జగన్ శుభాకాంక్షలు 

 తాడేపల్లి : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయం, కళానైపుణ్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. 2019–2024 మధ్య వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. `వైయస్‌ఆర్ నేతన్న నేస్తం` పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.3,706.16 కోట్ల సాయం అందించి చేనేత రంగానికి అండగా నిలిచామని పేర్కొన్నారు.

చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్‌, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్‌ అందించడంతో పాటు చేనేత ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాటు నేతన్న నేస్తం పథకాన్ని నిలిపివేసిందని, ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్‌, పవర్‌లూమ్స్‌కు ఉచిత విద్యుత్‌, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ వంటి హామీలు కూడా అమలు కాలేదని ఆరోపించారు. నేతన్నల హక్కులు, సంక్షేమం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తూ మరోసారి రాష్ట్రంలోని నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top