ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి

రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్సార్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్

 రామచంద్రపురంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు

రామచంద్రపురం: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం పట్టణంలో వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్సార్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

 డీఎస్సీ అక్రమాలపై నిజాలు వెలుగులోకి రావాలి

ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని, పారదర్శక దర్యాప్తుతో నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

 విద్యార్థుల బకాయిలు విడుదల చేయాలి.. హామీలు నిలబెట్టుకోవాలి

విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పిల్లి సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

 ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది

ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వైయ‌స్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమాలు మరింత ఉధృతంగా కొనసాగుతాయని పిల్లి సూర్యప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top