తాడేపల్లి: గతంలో తన హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కృష్ణా మిల్క్ యూనియన్‌ను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు దిగుతున్నారని, తాజాగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్ చలసాని ఆంజనేయులుతో 24 గంటల్లోనే రాజీనామా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శమని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. చలసాని ఆంజనేయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా, వెంటనే డిశ్చార్జ్ చేయించేందుకు, ఆయనతో రాజీనామా చేయించేందుకు ముగ్గురు మంత్రులు ప్రయత్నిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..: కృష్ణా మిల్క్ యూనియన్‌లో వెన్నుపోటు పార్టీ కూటమి అరాచకం: ఆంధ్రప్రదేశ్ లో ఎటు చూసినా అరాచకం, అక్రమాలు, భయాందోళనలు, బెదిరింపులు నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నిక రాజ్యాంగం ప్రకారం జరగకుండా తమ స్వప్రయోజనాల కోసం పని చేసే వారి కోసమే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. సొసైటీ ఎన్నికల్ని చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం జూలు విదుల్చుతున్నట్లు కనిపిస్తోంది. విజయ డెయిరీ నడుపుతున్న కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు పచ్చ పత్రికలకు కూటమి నాయకులు యాడ్స్ ఇచ్చుకున్నారు. ఈ ఎన్నిక జరుగుతుండగానే నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ మీటింగ్ తర్వాత హుటాహుటిన ఇద్దరు మంత్రులు పార్ధసారధి, కొల్లు రవీంద్ర విజయ డెయిరీ ఆఫీసుకు వెళ్లారు. వాళ్లు వెళ్లింది అక్కడ విజయ డైరీ అభివృద్ది కోసమో సంస్కరణల కోసమో మాట్లాడేందుకు కాదు. చలసాని ఆంజనేయులు ప్రజాస్వామ్యబద్ధంగా డైరెక్టర్ల మధ్య ఎన్నికయ్యారని తెలిసి, ఆయన్ను తక్షణం రాజీనామా చేయించడానికి వెళ్లారు. సహకార సంఘాల నిబంధనల ప్రకారం ఆయన ఎన్నికైనట్లు తెలిసిన తర్వాత కేబినెట్లో భేటీలో దీనిపై చర్చించి మంత్రులు అక్కడికి వెళ్లినట్లు కనిపిస్తోంది. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని ముంచిన చంద్రబాబు: ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002–03 మధ్యలో పక్కా ప్రణాళికతో హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని ఎలా మూసేశారో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ కు చెందిన విజయ డెయిరీ వ్యవహారం కూడా ఇలాగే కనిపిస్తోంది. ఇవాళ వేమూరి సాయి అనే డైరెక్టర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప్రజాస్వామ్య బద్దంగానే ఈ ఎన్నిక జరిగిందని వెల్లడించారు. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న సరే చలసాని ఆంజనేయుల్ని రాజీనామా చేయాలని మంత్రులు తమతోనే సమాచారం పంపిస్తున్నారని ఆయన చెప్తున్నారు. ఈ రోజు ఓ మంత్రి ఫోన్ చేసి, చలసాని ఆంజనేయులు ఆరోగ్య పరిస్ధితి బాగోలేదు, స్టెంట్ వేయాలని డాక్టర్లు చెప్తే, అక్కర్లేదు వెంటనే ఆయన్ను డిశ్చార్జ్ చేసేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇంకో మంత్రి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని, డైరెక్టర్లతో కూర్చుని సమావేశం ఏర్పాటు చేశారు. బెదిరించి రాజీనామా చేయించడం లేదా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఎన్నికైన ఛైర్మన్ పై రెండు నెలలకే అవిశ్వాస తీర్మానం పెట్టలేరు కాబట్టి ఎలాగైనా ఆయనతో రాజీనామా చేయించాలని చూస్తున్నారు. తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసుల సాయంతో దౌర్జన్యంగా గెలిచారు. ఇప్పుడు అలాగే సహకార రైతు సంఘాల ఎన్నికల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. ముడుపుల రహస్యాలు ఏవీ లేకపోతే మీ పార్టీ అతనే గెలిచినా ముగ్గురు మంత్రులు ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు. చలసానికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పార్టీ కావాలా? పదవి కావాలా?.. విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తీరుపై ప్రభుత్వం ఆగ్రహం, మంత్రుల మంతనాలు అని సాక్ష్యాత్తు ఈనాడు పత్రికలోనే రాయిస్తున్నారు. అంటే మీరు చెప్పిన వాళ్లే ఉండాలే, మీరు చెప్పిన నిబంధనలే ఉండాలా, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అక్కర్లేదా? చంద్రబాబూ మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు?, ఎందుకు చలసాని ఆంజనేయుల్ని తీసేయాలని ప్రభుత్వం అనుకుంటుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంజనేయులుగారికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. సహకార సంఘం ఎన్నికలైనా, పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక అయినా ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో అర్థమవుతోంది. చిత్తూరు డెయిరీ తరహానే కృష్ణా మిల్క్ యూనియన్ నిర్వీర్యం కాబోతోందా అనేది చూడాలి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి తమ చిత్తశుద్ది నిరూపించుకోవాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.