నరసరావుపేట: డీఎస్సీ–2025 పరీక్షలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అదే విధంగా విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.