తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల పవిత్రత, విశ్వసనీయత మరియు పారదర్శకతను కాపాడాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రధాన కమిషనర్, మరియు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) లకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రెండు వేర్వేరు లేఖలు రాశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా "ఒక వ్యక్తి - ఒక ఓటు" విధానం పక్కాగా అమలుకావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో దాదాపు 16.03% ఉన్న 36,388 అనుమానాస్పద, డూప్లికేట్ మరియు బహుళ (పొరుగు రాష్ట్రాల ఓట్లతో సహా) ఓట్లపై తక్షణమే ప్రాధాన్యత క్రమంలో విచారణ జరిపి, జూలై 21, 2026న వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన వినతిపత్రంపై 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' ఇవ్వాలని ఈసీఐ ని కోరారు. కుప్పం కేవలం ఉదాహరణ మాత్రమేనని, రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బూత్, ఈపీఐసీ వారీగా సమగ్ర తనిఖీలు నిర్వహించాలని, పక్కాగా నిర్ధారణ అయిన అదనపు నమోదులను సరైన చట్టపరమైన ప్రక్రియ మరియు నోటీసుల అనంతరం మాత్రమే తొలగించాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కింద డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణకు ముందే—ప్రతి పోలింగ్ బూత్ వారీగా ఉన్న ASDD (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్/డూప్లికేట్) జాబితాలను రాజకీయ పార్టీలకు హార్డ్ మరియు సాఫ్ట్ కాపీల రూపంలో అందించాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిని అభ్యర్థించారు. తద్వారా క్లరికల్ లేదా సిబ్బంది పొరపాట్ల వల్ల ఏ ఒక్క అర్హత కలిగిన నిజమైన పౌరుడి ఓటు హక్కు దురదృష్టవశాత్తూ తొలగించబడకుండా రక్షణ కల్పించవచ్చని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏం రాశారంటే... లేఖలలో పేర్కొన్న ముఖ్యాంశాలు: 1. కుప్పం సహా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బోగస్ ఓట్ల తనిఖీ చేపట్టాలి. గతంలో 21.07.2026న మేము సమర్పించిన వినతిపత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (Action-Taken Report) ఇవ్వాలి. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,27,034 మంది ఓటర్లలో ఏకంగా 36,388 (16.03%) అనుమానాస్పద డూప్లికేట్ లేదా బహుళ నమోదులు ఉన్నట్లు మా విశ్లేషణలో తేలింది. ఇది అత్యవసరంగా పరిశీలించాల్సిన అంశం. నమూనా జాబితా వర్గీకరణ: కుప్పంతో పాటు ఎమ్మిగనూరు (36,027 ఓట్లు - 14.48%), ఆదోని (34,630 ఓట్లు - 13.08%), మడకశిర (34,304 ఓట్లు - 16.20%), కోడుమూరు (33,373 ఓట్లు - 13.49%) నియోజకవర్గాల్లో భారీగా అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా 4 రకాల డూప్లికేట్ నమోదులు: 1. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బహుళ నమోదులు. 2. ఒకే పార్లమెంటరీ నియోజకవర్గంలోని వేర్వేరు అసెంబ్లీల్లో నమోదులు. 3. రాష్ట్రంలోని వేర్వేరు పార్లమెంట్ స్థానాల పరిధిలో బహుళ నమోదులు. 4. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్) కూడా ఓటు నమోదు అయి ఉండటం. అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో పొరుగు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారల CEOల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలి. ఏరోనెట్ (ERONET),ఎపిక్(EPIC), డెమోగ్రాఫిక్ వివరాలు మరియు ఫోటోల పోలిక ద్వారా పరిశీలన జరపాలి. కేవలం సాఫ్ట్‌వేర్ లేదా ఆటోమేటెడ్ మ్యాచింగ్ ఆధారంగా ఏ ఓటరు పేరునూ నేరుగా తొలగించకూడదు. ప్రతి అనుమానాస్పద కేసులోనూ సంబంధిత ఓటరుకు వ్యక్తిగత నోటీసు ఇచ్చి, భౌతిక తనిఖీ చేసి, సమాధానమిచ్చే అవకాశం కల్పించిన తర్వాతే ఈఆర్‌ఓ (ERO) తగిన ఉత్తర్వులు ఇవ్వాలి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందే 'ASDD' (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్/డూప్లికేట్) జాబితాలు ఇవ్వాలి.. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కింద ఇంటింటి సర్వే పూర్తయి, త్వరలోనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో... డ్రాఫ్ట్ ప్రచురణకు ముందే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, పోలింగ్ బూత్ వారీగా ఉన్న ASDD (Absent, Shifted, Dead/Duplicate) జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలి. ASDD జాబితాల అవసరం & ప్రయోజనాలు: బూత్ స్థాయిలో 'ఆబ్సెంట్', 'షిఫ్టెడ్', 'డెడ్' లేదా 'డూప్లికేట్' అని గుర్తించిన వివరాల సరైన సమాచారాన్ని పార్టీలు సరిచూసుకోవడానికి వీలవుతుంది. అర్హులైన పౌరులు పొరపాటున తొలగింపు జాబితాలో చేరి ఉంటే, సమయానికి ప్రాతినిధ్యం వహించి వారి పేర్లను తిరిగి జాబితాలో చేర్పించవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 మరియు కేంద్ర ఎన్నికల సంఘం సూచనల సూచనల ప్రకారం నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు, దావాలు దాఖలు చేయడానికి రాజకీయ పార్టీలకు, ప్రజలకు తగిన సమయం లభిస్తుంది. మరోవైపుపరిశీలన సులభతరం కావడానికి బూత్ వారీ, నియోజకవర్గం వారీగా డౌన్‌లోడ్ చేసుకునే వీలున్న సాఫ్ట్ కాపీలతో పాటు హార్డ్ కాపీలను అందించేలా జిల్లా ఎన్నికల అధికారులను (DEOs/EROs) ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారికి, కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు.