దస్తావేజు లేఖరుల ఉపాధి పరిరక్షణకు వైయ‌స్ఆర్‌సీపీ అండ

జీవో నంబర్‌ 396ను రద్దు చేయాలని శ్రీ వైయస్‌ జగన్‌కు వినతి

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భరోసా

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏపీ రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ జారీ చేసిన జీవో నంబర్‌ 396ను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

జీవో నంబర్‌ 396 దస్తావేజు లేఖరుల ఉపాధికి మరణశాసనంగా మారుతుందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తే దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు తమ ఉపాధితోపాటు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు.

ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులతోపాటు స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వీరిపై ఆధారపడిన కుటుంబాలను కలుపుకొంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ప్రస్తుతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధికి భద్రత కల్పించాలని కోరారు.

తమ వృత్తిని, జీవనోపాధిని పరిరక్షించేలా జీవో నంబర్‌ 396ను తక్షణమే రద్దు చేయాలని, దస్తావేజు లేఖరులు, స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకుల ప్రయోజనాలను కాపాడే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంఘం ప్రతినిధులు వివరించిన సమస్యలను శ్రీ వైయస్‌ జగన్‌ సావధానంగా విన్నారు. దస్తావేజు లేఖరులు, వారిపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధి పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, సంఘం ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు ఉన్నారు.

Back to Top