అన్నమయ్య జిల్లా: రాజంపేట మండలం బాలరాజుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, రమేష్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ కూటమి నేతలు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాలలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా చెయ్యేరు నదిలో భారీ గుంతలు తవ్వి నది సహజ స్వరూపాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా వల్ల సమీప గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. సామర్థ్యానికి మించి అధిక లోడుతో ఇసుక తరలిస్తున్న వాహనాల కారణంగా గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు వివరించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పొలాలు, తోటలకు వెళ్లడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.