ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నాయకుల దాడులు హేయం 

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ  ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర 
అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి 

ఉద్యోగులపై దాడులకు ఎస్పీలు, కలెక్టర్లదే బాధ్యత 

నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి 

ప్రెస్‌మీట్‌లో ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నాయకులు దాడులు చేయడం నిత్యకృత్యమై పోయిందని వైయస్సార్‌సీపీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. బాధితులు, ప్రజా సంఘాలు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం చలనం లేకుండా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.
    తాజాగా చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని మోటుమల్లెల వీఆర్వో దామోదరంపై టీడీపీ నాయకుడు సుందరం చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు:
    చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని మోటుమల్లెల గ్రామ వీఆర్వో దామోదరంపై టీడీపీ నాయకుడు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రొంపిచర్ల తహసీల్దార్‌ ఆఫీసులో వీఆర్వో దామోదరం రైతులతో భూ రికార్డుల గురించి మాట్లాడుతుండగా, సుందరం అనే టీడీపీ నాయకుడు కుర్చీతో దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో వీఆర్వో దామోదరం మూడు దంతాలు ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గ్రామస్తులను కూడా సదరు నాయకుడు బెదిరించి పంపించాడు. అధికార పార్టీ నాయకుడిని అనే మదంతో, తాను ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే అధికారిపై దాడికి తెగబడటం రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలకు అద్దం పడుతోంది.

ఇకనైనా అలాంటి దాడులు అరికట్టండి:
    ఉద్యోగుల గౌరవాన్ని నిలబెట్టి, అనుకూల వాతావరణం 

సృష్టిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు తన పార్టీ నాయకులు ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. వీఆర్వో దామోదరంపై జరిగిన దాడి ఘటనపై తహసీల్దార్‌ ఇప్పటికే కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా వారిలో చలనం లేదు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులపై జరిగే దాడులకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top