వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ జిల్లాలో రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే కడప నగరంలోని ఇర్కాన్ సర్కిల్ నుంచి జేఎంజే సర్కిల్ వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. కడప కార్పొరేషన్ పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇంటర్‌లాకింగ్ పేవర్డ్ బ్లాక్స్‌తో పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. ఎంపీ చేసిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఆయా పనులను త్వరలో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.