ఏపీలోనూ జంతర్‌ మంతర్‌ తరహాలో నిరసనలు

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటన

డీఎస్సీ అక్రమాలపై ఈనెల 31 నుంచి కార్యాచరణ

ఆగస్టు 10 వరకు వేర్వేరు కార్యక్రమాలు

ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం

మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడి

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని).

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే

మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌

డీఎస్సీ అక్రమాలకు విద్యాశాఖను వాడుకున్న లోకేష్‌

డీఎస్సీ నియామక ప్రక్రియను భ్రష్టు పట్టించారు

నోటిఫికేషన్‌ నుంచి నియామకాల దాకా అక్రమాల పుట్ట

దీనిపై సమాధానం చెప్పకుండా లోకేష్‌ సొల్లు కబుర్లు

మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

టీడీపీ నేతల చేతుల్లో ఉన్న క్రీడాసంఘాల నుంచే సర్టిఫికెట్లు

జీవోలు మార్చి స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు

స్పోర్ట్స్‌ కోటా టీచర్లతో నారా దేవాన్ష్‌కు పాఠాలు చెప్పించగలరా?

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్న

తాడేపల్లి: నీట్‌ అక్రమాలపై ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో జరిగిన స్థాయి ఆందోళనలు ఏపీలోనూ డీఎస్సీ అక్రమాలపై జరగాల్సిన అవసరం ఉందని వైయస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల్ని తాము ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా విద్యా మంత్రి లోకేష్‌ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గుచేటని ఆయన చురకలంటించారు. అందుకే డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఈనెల 31 నుంచి భారీ ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.  
ప్రెస్‌ మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఇదీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాల పర్వం:
    2025 డీఎస్సీ మొదలుపెట్టగానే, అంతకు ముందు జగన్‌గారి హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్‌నే పరీక్షలు నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారు.
    ఇంకా జగన్‌గారి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను, అప్‌ లోడింగ్‌ ను, డిజిటలైజేషన్‌ను పూర్తిగా ఎస్సీఈఆర్టీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైన నవీన్‌ జిల్లా టాపర్‌గా వస్తాడు. అతని నియామకాన్ని తిరిగి రద్దు చేశారు. ఆ తర్వాత రెండో మెరిట్‌ లిస్ట్‌ ఇచ్చారు. 

అక్రమాలు ఒప్పుకోకుండా లోకేష్‌ సవాళ్లు!:
    విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాటలు కోటలు దాటిస్తారు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడానికి సొల్లు కబుర్లు చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్ప అన్ని శాఖలూ చూస్తారు. విద్యాశాఖను కేవలం డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను భ్రష్టు పట్టించడానికి తన పదవిని వాడుకున్నారు. 
    అసలు నవీన్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో తెలియట్లేదా? పేపర్‌ లీక్‌ను లోకేష్‌ సిబ్బంది ఒప్పుకుంటున్నారు. కలెక్టరేట్‌లో ప్రదర్శించాల్సిన మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు పెట్టలేదు? టాప్‌ ర్యాంకర్‌గా వచ్చిన నవీన్‌ను తీసేసి రెండో లిస్ట్‌ ఎందుకు విడుదల చేశారు? మెరిట్‌ లిస్ట్‌ లో నుంచి నవీన్‌ ను ఎందుకు తీసేశారో కోర్టుకు కూడా చెప్పకుండా వాయిదాలు తీసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్‌ రెడ్డి గారి ఇంటి గేటు బయట నిలబడ్డాను, పిలిచాను ఆయన రాలేదని సొల్లు కబుర్లు ఎందుకు?.

స్పోర్ట్‌ కోటాలో ఉద్యోగాలు అమ్ముకోలేదా?:
    స్పోర్ట్స్‌ కోటా కోసం అప్పటివరకూ ఉన్న జీవో:74 ఉండేది. అప్పుడు 2 శాతం కోటాలో ఉద్యోగాలు ఇచ్చే వారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్, డీఎస్సీ క్వాలిఫై కావాలి. లోకేష్‌ విద్యామంత్రి కాక ముందు ఈ నిబంధన ఉండేది. లోకేష్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చే రోజే అంటే 2025,  ఏప్రిల్‌ 19న ప్రకటన చేసే గంట ముందే స్పోర్ట్స్‌ కోటా కొత్త జీవో:4 ఇస్తారు. అదే సమయంలో జీఏడీ జీవో నెం:47 ఇస్తుంది. అందరితో పాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు. టెట్, డీఎస్సీలు రాయాల్సిన పని లేదు. ఏదో ఒక పిచ్చి సర్టిఫికెట్‌ ఉంటే చాలంటారు.
    లోకేష్‌ స్పోర్ట్స్‌ కోటాలో నియామక పత్రాలు ఇచ్చిన వారంతా వ్యాయామ ఉపాధ్యాయులు కాదు. మ్యాథ్స్, సైన్స్‌ కూడా చెప్తారట!. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు వచ్చిన స్కూల్లో.. సబ్జెక్టులు చెప్పే టీచర్లతో నారా లోకేష్‌ కొడుకు నారా దేవాన్‌‡్షకు పాఠాలు చెప్పించే ధైర్యం ఉందా?
    విద్యార్ధుల బాధలు పట్టించుకోరు. టైమ్‌కి పుస్తకాలు, యూనిఫామ్స్‌ ఇవ్వరు. హాస్టళ్ల పరిస్ధితి దయనీయంగా ఉంది. మంగళగిరిలోనో, పునాదిపాడులోనో దాతలు ఇచ్చిన డబ్బులతో స్కూల్‌ కడితే విద్యాశాఖను మార్చి చూపించినట్లు అవుతుందా? డీఎస్సీ పూర్తయ్యాక స్పోర్ట్స్‌ కోటాలో మళ్లీ మార్పులు చేస్తూ జీవో నెం:56 జారీ చేశారు. దొడ్డి దారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి మళ్లీ జీవోలు మార్చి మార్చేశారు.  జాతీయ స్దాయి గోల్డ్‌ మెడల్‌ వచ్చిన దుర్గయ్యకు ఇవ్వకుండా రాష్ట్ర స్ధాయిలో ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు. 

ఏపీలోనూ జంతర్‌ మంతర్‌ తరహా నిరసనలు:
    రాష్ట్రంలో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ తరహాలో నిరసనలు జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై యువత ఆలోచించాలి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందే. దాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. అవినీతిమయంగా, తప్పులు తడకగా మారిన డీఎస్సీ నియామక ప్రక్రియకు కారణమైన లోకేష్‌ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇచ్చే వరకూ నెల నెలా నిరుద్యోగభృతి ఇవ్వాల్సిందే.  
    ఇవే డిమాండ్లతో ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వైయస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు విజ్ఞాపన పత్రాలు అందజేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 3 లేదా 4వ తేదీన నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్‌ మీటింగ్స్‌.. ఆగస్టు 6 నుంచి 9 వరకు అదే స్థాయిలో యువకులు, విద్యార్ధులు, నిరుద్యోగులతో రిలే నిరాహార దీక్షలు చేపడతాం. అనంతరం ఆగస్టు 10న నియోజకవర్గ స్ధాయిలోనే ర్యాలీలు నిర్వహిస్తాం. డీఎస్సీ 2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేష్‌ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించాలన్నవే మా డిమాండ్స్‌. మొదటి అంకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.

అడ్డగోలుగా సర్టిఫికెట్లు. వాటితో ఉద్యోగాలు:
    కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ 38 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లోకేష్‌ తోడల్లుడు భరత్‌ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు సిగ్గూ శరం లేకుండా మీ దగ్గర ఆధారాలుంటే ఆ సర్టిఫికెట్లు నకిలీవని పిటిషన్లు పెట్టమని సవాళ్లు విసురుతున్నారు. దొంగలకు వంత పాడుతూ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఆన్‌ లైన్‌లో ఆ సర్టిఫికెట్లు పెట్టి నిజమా ఫేకా అని అడగండి. బ్రిడ్జి అనే ఆట పేకాటే అని మేం మరోసారి చెప్తున్నాం. పేకాటతో పాటు రమ్మీ కూడా బ్రెయిన్‌ గేమే అనేది చట్టాలు చూసి తెలుసుకోండి. రమ్మీ, పేకాటకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? వీటిపై ప్రశ్నిస్తే శ్రీకాకుళం జిల్లాలో నాపై కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన పోలీసులు పశ్చాత్తాప పడే రోజు వస్తుంది. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి, వాటి కోసం చేసిన బేరసారాల్లో దొరికిపోయి ఇంకా బుకాయిస్తున్నారు.
    ఆధారాల్లో ఫోన్‌ నంబర్‌ కనిపిస్తున్నా ఎఫ్‌ఐఆర్‌లో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో లోకేష్‌ తేల్చాలి. ఎవరూ లేకపోతే పోలీసులు ఎందుకు దీనిపై విచారణ జరపడం లేదో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.

Back to Top