ప్ర‌జాభిమానం చూసి ఓర్వ‌లేకనే వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఆంక్ష‌లు 

ఆయన ప్ర‌జ‌ల్లోకి వ‌స్తుంటే కూట‌మి ప్ర‌భుత్వంలో వ‌ణుకు 

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను అక్ర‌మ కేసుల‌తో అడ్డుకోలేరు

పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు అక్ర‌మ అరెస్టులు

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు క‌ట్టుదిట్టమైన పోలీస్ భ‌ద్ర‌త క‌ల్పించాలి 

ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పే రోజులు రాబోతున్నాయి 

కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల ఆగ్ర‌హం 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధులు పుత్తా శివ‌శంక‌ర్, 
ఆరె శ్యామ‌ల, మంచా నాగ‌మ‌ల్లీశ్వ‌రి  

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ ప్రజల మధ్యకు వస్తున్న ప్రతిసారీ పోలీసు నిర్బంధాలు, రాకపోకలపై ఆంక్షలు, బారికేడ్లు, కాన్వాయ్‌పై పరిమితులు విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.  వైయ‌స్‌ జగన్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వైయ‌స్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతుండటాన్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఎంతటి ఆంక్షలు విధించినా ప్రజల అభిమానాన్ని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం ఎవరి వల్ల కాదని పేర్కొన్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు పర్య‌ట‌న‌ల‌కు ఆటంకాలు సృష్టించ‌లేదు : వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్ 

జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు గారిని ప‌రామ‌ర్శించ‌డానికి వైఎస్ జ‌గ‌న్ గారు శ్రీకాకుళం వెళ్తున్నార‌ని ప్ర‌క‌టించిన వెంట‌నే కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌ల‌కు తెర‌లేపింది. ఉత్త‌రాంధ్ర వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల క‌ద‌లిక‌ల‌పై ప్ర‌భుత్వం నిఘా పెట్టింది. త‌మ అభిమాన నాయ‌కుడిని కలిసేందుకు వీలులేదంటూ నోటీసులు ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ జ‌గ‌న్ గారు బ‌య‌ట‌కొస్తే ప్ర‌భుత్వం ఇంత‌లా ఎందుకు భ‌య‌ప‌డిపోతోంది? మాజీ ముఖ్య‌మంత్రికి రాష్ట్రంలో ప‌ర్య‌టించే హక్కు లేదా?  త‌మ అభిమాన నాయ‌కుడిని కార్య‌క‌ర్త‌లు, అభిమానులు క‌లుసుకోవ‌డం నేర‌మా? సీఎం చంద్ర‌బాబు ఒక నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తూ భార‌త రాజ్యాంగం ఇచ్చిన హక్కుల‌ను కాల‌రాస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ గారికి రోజురోజుకీ పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి ప్ర‌భుత్వం ఓర్వ‌లేకపోతోంది. గ‌తంలో జ‌గ‌న్ గారు ఇలాగే నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వెళితే, ఆయ‌న్ను క‌లిసేందుకు వ‌చ్చే కార్య‌క‌ర్త‌లను నిలువ‌రించేందుకు వాహ‌నాలు తిరిగే అవ‌కాశం లేకుండా ఏకంగా రోడ్లు త‌వ్వేసి త‌మ అక్క‌సును ప్ర‌ద‌ర్శించారు. చేయ‌ని నేరానికి మాజీ మంత్రిని అరెస్టు చేసి జైలుకు పంప‌డ‌మే కాకుండా త‌ప్పుడు సెక్ష‌న్ల కింద కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు. ఫేక్ మీడియా ఫ్యాక్ట‌రీల ద్వారా త‌ప్పుల‌నే ఒప్పులుగా చిత్రీక‌రిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్ గారు ఆయ‌న్ను స్వేచ్ఛ‌గా తిర‌గ‌నిచ్చారు. కానీ ఆయ‌న మాత్రం రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో రాష్ట్రంలో అశాంతి వాతావ‌ర‌ణం సృష్టించారు. తెలుగుదేశం గూండాల‌తో పోలీసుల‌పైనే దాడులు చేయించిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది. కానీ గ‌డిచిన రెండేళ్లుగా జ‌గ‌న్ గారి ప‌ర్య‌ట‌న‌లు చూస్తే ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలోనే జ‌రుగుతున్నాయి. అయినా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పంపించి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు. పార్టీ నాయ‌కుడిని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తుంటే.. జ‌గ‌న్‌ క్రిమిన‌ల్స్ ని ప‌రామ‌ర్శిస్తున్నాడంటూ చంద్ర‌బాబు త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడు. చంద్ర‌బాబు స‌హా ఆయ‌న కేబినెట్‌లో ఉన్న నాయ‌కులంద‌రిపైనా ఉన్న క్రిమిన‌ల్ కేసుల గురించి ఆరాతీస్తే, అస‌లైన క్రిమిన‌ల్స్ ఎవ‌రో తెలిసిపోతుంది. ఎన్ని ఆంక్ష‌లు విధించినా వైఎస్ జ‌గ‌న్ గారిని క‌లిసేందుకు వ‌చ్చే అభిమానుల‌ను ఎంత‌మాత్రం ఆప‌లేరని గుర్తుంచుకుంటే మంచిది. నిర్బంధాల ద్వారా త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లే తుత్తునియ‌లు చేయ‌డం తథ్యం. 

రెండేళ్లుగా శాంతియుత వాతావ‌ర‌ణంలోనే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు:  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల 

వైఎస్ జగన్ గారి శ్రీకాకుళం పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు పెడుతూ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది.  కాన్వాయ్‌ని 8 వాహనాలకే పరిమితం చేయడం, జ‌గ‌న్ గారిని క‌లిసేందుకు రాకుండా పార్టీ నాయ‌కుల‌కు ముందస్తు నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేయ‌డం లాంటి కార్య‌క్ర‌మాల‌తో ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి అక్రమ అరెస్టును, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని హత్యాప్రయత్నంగా చిత్రీకరిస్తున్న అధికార అనుకూల మీడియా ప్రచారాన్ని ఖండిస్తూ ఆయనకు భరోసానివ్వడానికే వైఎస్ జగన్ గారు శ్రీకాకుళం వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జగన్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను ప్రజాబలాన్ని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం అభద్రతా భావంతో ఆంక్షలు పెడుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం గ‌డిచిన రెండేళ్లుగా జ‌గ‌న్ గారు ఏ కార్య‌క్ర‌మం మీద బ‌య‌ట‌కొచ్చినా ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోంది. ప్రభుత్వం ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, నోటీసులు ఇచ్చినా వైఎస్ జగన్ గారిని ఆయన అభిమానుల నుంచి, ప్రజల నుంచి వేరు చేయడం ఎవరి తరమూ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ శాంతియుత విధానాలనే నమ్ముకుని చట్టబద్ధంగా పోలీసులకు సహకరిస్తూ వస్తోంది తప్ప ఎక్కడా హింసాత్మక ఘటనలకు తావివ్వలేదు. కాబట్టి వైఎస్ జగన్ గారిని కలిసేందుకు వస్తున్న నాయకులను, కార్యకర్తలను, ప్రజలను అడ్డుకోకుండా అనుమతించాలని కూటమి ప్రభుత్వాన్ని, పోలీసుల‌ను కోరుతున్నాం.

ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోంది:  నాగ‌మ‌ల్లీశ్వ‌రి
అధికారం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు న్యాయం చేయ‌క‌పోగా వారి ప‌క్షాన పోరాడుతున్న  వైఎస్ జ‌గ‌న్, వైయ‌స్ఆర్‌సీపీ ప‌ట్ల క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తుంటే ఈ కూట‌మి ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోంది. వారి వైఫ‌ల్యాలను ఎత్తి చూపుతున్నందుకే సీదిరి అప్ప‌ల‌రాజు స‌హా బీసీ నాయ‌కుల‌ను అక్ర‌మ కేసుల‌తో వేధిస్తున్నారు. రోడ్డు ప్ర‌మాదాన్ని హ‌త్యాయ‌త్నంగా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా తీవ్ర‌మైన కుట్ర‌లు చేస్తోంది. వైఎస్ జ‌గ‌న్ గారి ప‌ర్య‌ట‌న‌ల‌కు తండోప‌తండాలుగా జ‌నం త‌ర‌లివ‌స్తుంటే ఈ ప్ర‌భుత్వానికి నిద్ర ప‌ట్ట‌డం లేదు. ఆయ‌న కోసం వ‌స్తున్న అభిమానుల‌ను ఎలా క‌ట్ట‌డి చేయాల‌న్న ధ్యాసే త‌ప్ప‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో ఈ ప్ర‌భుత్వం ప్ర‌తి సంద‌ర్భంలోనూ విఫ‌ల‌మ‌వుతూనే ఉంది. జ‌గ‌న్ గారి ప‌ర్య‌ట‌న‌ల‌కు నాయ‌కులు రాకుండా ముంద‌స్తుగా నోటీసులు ఇవ్వండం చూస్తుంటే ఈ ప్ర‌భుత్వం ఆయ‌న్ను చూస్తే ఎంత‌గా భ‌య‌ప‌డిపోతుందో అర్థ‌మైపోతోంది. జ‌గ‌న్ గారి కోసం వ‌స్తున్న ప్ర‌జ‌ల‌ను ఆప‌డం సాధ్య‌మయ్యే ప‌నికాద‌ని ఇప్ప‌టికైనా గ్ర‌హించి ప్ర‌జల‌కు ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేయ‌డంపై సీఎం చంద్ర‌బాబు దృష్టిపెడితే బాగుంటుంది.

Back to Top