విద్యాశాఖలో ‘రెడ్‌బుక్’ అరాచకం.. 

ఎమ్మెల్సీ కల్పలత కుటుంబంపై కక్ష సాధింపు
 

విజయవాడ: విద్యాశాఖలో ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతున్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో టార్గెట్ చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీఈఆర్‌టీ మాజీ డైరెక్టర్, ప్రస్తుతం వయోజన విద్య జేడీగా పనిచేస్తున్న తన భర్త ప్రతాప్‌రెడ్డిపై ఐదేళ్ల క్రితం పెట్టుకున్న సెలవుకు ఇప్పుడు ఛార్జ్‌మెమో జారీ చేయడం కక్ష సాధింపులో భాగమేనని పేర్కొన్నారు.

తన భర్త సెలవు పెట్టిన అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని కల్పలతారెడ్డి తెలిపారు. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్క సమావేశం కూడా నిర్వహించని అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను లేవనెత్తుతున్నందుకే తన కుటుంబాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అన్నారు.

ఉద్యోగుల కోసం మాట్లాడితే తనపైనా మరో ఛార్జ్‌మెమో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కల్పలతారెడ్డి తెలిపారు. తన గొంతు నొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగుల సమస్యలపై మాట్లాడటం ఆపబోనన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని, ఐదు డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆమె కోరారు. తనపై, తన భర్తపై జరుగుతున్న కక్ష సాధింపుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా టార్గెట్ చేస్తే అంత గట్టిగా ఉద్యోగుల సమస్యల కోసం పోరాడతానని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top