శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు

లేళ్ల అప్పిరెడ్డి  

వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష‌లపై కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను ఖండిస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశాఖపట్నంలోని రిలే నిరాహార దీక్షా శిబిరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మీడియాతో మాట్లాడారు.

 డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరపాల్సిందే

 డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

 గాంధేయ మార్గంలో రిలే దీక్షలు చేస్తుంటే శిబిరాలపై పోలీసు దాడులా?

 దీక్షా శిబిరాల తొలగింపు, అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో ప్రజాస్వామ్య హక్కుల కాలరాత

 డీఎస్సీ బాధితుల న్యాయపోరాటాన్ని అణచివేసే కూటమి ప్రభుత్వ దౌర్జన్యాన్ని వెంటనే ఆపాలి

 రిలే నిరాహార దీక్ష‌లు ముగిసినా పోరాటం ఆగదు.. సోమవారం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు

 విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

 అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చే వరకు.. డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్సార్‌సీపీ పోరాటం

 మీడియా సమావేశంలో తేల్చి చెప్పిన లేళ్ల అప్పిరెడ్డి, కేకే రాజు

తాడేపల్లి/విశాఖపట్నం:  వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత రిలే రిలే నిరాహార దీక్ష‌లను అడ్డుకోవడం, దీక్షా శిబిరాలపై దాడులు చేయడం, పోలీసులు అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలకు పాల్పడటం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ-2025 అక్రమాలపై న్యాయం చేయాలని కోరుతూ గాంధేయ మార్గంలో నిరసన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపడం దారుణమని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి, విశాఖపట్నంలోని రిలే నిరాహార  దీక్షా శిబిరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మీడియాతో మాట్లాడారు.

- డీఎస్సీపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

డీఎస్సీ పరీక్ష ప్రక్రియ ప్రారంభం నుంచి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు పరీక్ష బాధ్యతలు అప్పగించడం, ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడింగ్‌, ప్రింటింగ్‌ ప్రక్రియలో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఉపయోగించడం జరిగిందా? నవీన్‌కు మొదటి ర్యాంక్‌ వచ్చినా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? రెండో మెరిట్‌ లిస్టులో అతని పేరు ఎందుకు తొలగించారు? స్పోర్ట్స్‌ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ పరీక్ష నోటిఫికేషన్‌కు ముందు 4, 47 జీవోలు ఎందుకు తెచ్చారు? పరీక్ష లేకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? అర్హులైన గోల్డ్‌ మెడలిస్టులను పక్కనపెట్టి అనర్హులకు అవకాశాలు ఎందుకు కల్పించారు? ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జీవోలు రద్దు చేసి 56వ జీవో ఎందుకు తెచ్చారు? వీటన్నింటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలి.

-  అధికారుల బదిలీలపై సమాధానం చెప్పాలి

డీఎస్సీ నిర్వహణ సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు వరుసగా ఎందుకు బదిలీ అయ్యారు? పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజు, కార్యదర్శి కోనా శశిధర్‌, పీఎస్‌ గిరీష్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ ఇప్పుడు ఆ స్థానాల్లో లేరు. స్పోర్ట్స్‌ కోటా, డీఎస్సీ పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులు, శాప్‌ అధికారులను కూడా ఎందుకు మార్చారు? అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు ముందు కోనా శశిధర్‌ను హడావుడిగా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వీటిపై చంద్రబాబు, లోకేష్‌ సమాధానం చెప్పాలి. డీఎస్సీపై శాసనసభ, శాసనమండలిలో వాయిదా తీర్మానం ద్వారా చర్చకు తీసుకువస్తాం. మంత్రి లోకేష్‌ చర్చకు సిద్ధంగా ఉండాలి. అమరావతిలో అద్దాలు, భవనాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు? ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, విద్యార్థుల హక్కుల కోసం వైయ‌స్సార్‌సీపీ అసెంబ్లీ, మండలిలో గట్టిగా పోరాడుతుంది.

- దీక్షలపై దాడులు ఆపాలి.. పోరాటం కొనసాగుతుంది

డీఎస్సీ అక్రమాలపై 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్ష‌లు చేస్తుంటే శిబిరాలపై దాడులు చేయడం, తొలగించడం, అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గం. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని ఈడ్చుకెళ్లడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లడం, విజయవాడలో దీక్షా శిబిరంపై ఎమ్మెల్యే బోండా ఉమా దాడి చేయడం, బుద్ధా వెంకన్న వర్గం బెదిరింపులకు దిగడం ప్రజలు చూశారు. చంద్రబాబు దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని రౌడీలు, బ్లేడ్‌ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లుగా చిత్రీకరించడం సరికాదు. మాపై కేసులు పెట్టినా, పోలీసులతో దీక్షలు అడ్డుకున్నా మా పోరాటం ఆగదు. రిలే దీక్షలు ముగిసినా సోమవారం 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం మొండివైఖరి వీడి సీబీఐ విచారణ జరిపి న్యాయం చేయాలి. అవసరమైతే వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అదనపు పోస్టులు సృష్టించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. లోకేష్‌ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుంది.

విశాఖపట్నంలోని రిలే నిరాహార దీక్షా శిబిరంలో విశాఖ జిల్లా వైయ‌స్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు మీడియాతో మాట్లాడారు.

- విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసి.. యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారి హయాంలో అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మనబడి నాడు–నేడు వంటి పథకాలతో పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పించాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల్లోనే 1,38,500 మందికి ఎలాంటి లంచం, సిఫార్సులు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. మరో 2.5 లక్షల మందికి వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాం. ఎన్నికలకు ముందు 40 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 25 నెలలు గడిచినా ఆ హామీలను పట్టించుకోవడం లేదు. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అరకొరగా నిధులు ఇస్తున్నారు. విద్యాశాఖ బడ్జెట్‌ నుంచి ఇవ్వాల్సిన నిధులకు బదులుగా దేవాదాయ శాఖ భక్తుల కానుకల నిధులను వినియోగించే ప్రయత్నం చేయడం దారుణం. విద్యా కానుకను కూడా సకాలంలో అందించకుండా పేద విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది.”

- డీఎస్సీ బాధితుల పక్షాన పోరాటం కొనసాగుతుంది

 డీఎస్సీ-2025లో ఏళ్ల తరబడి కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. పరీక్ష ఫలితాల అనంతరం మెరిట్‌ లిస్టులో మార్పులు, లక్షల రూపాయలు చేతులు మారి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు వంటి అంశాలపై నిష్పక్షపాత విచారణ జరగాలి. సీబీఐతో పాటు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా డీఎస్సీ బాధిత అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో లోకేష్‌ చర్చకు రావాలి. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా తీసుకొచ్చిన పెట్టుబడుల్లో భాగంగానే అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అదానీ డేటా సెంటర్‌ ఒప్పందం కూడా అప్పటి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. నాటి ప్రభుత్వ కృషికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్‌ తీసుకోవడం సరికాదు. ఎల్లో మీడియా ప్రచారాలతో వాస్తవాలను దాచలేరు. యువత హక్కుల కోసం, డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది.

Back to Top