తాడేపల్లి: భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైనదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. హృదయపూర్వక అభినందనలు ఈ సందర్భంగా.. అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైయస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదే విధంగా.. రికర్వ్ ఆర్చరీ ప్రపంచకప్‌ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన ఏపీకి చెందిన ధీరజ్ బొమ్మదేవరను వైయస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక AHF జూనియర్ ఆసియా కప్ 2026 టైటిళ్లను గెలుచుకుని దేశ కీర్తిని చాటిన భారత జూనియర్ పురుష, మహిళల హాకీ జట్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ‘మన క్రీడాకారుల పట్టుదల, కఠోర శ్రమ, అంకితభావం కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి. భవిష్యత్తులోనూ మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలి. భారతదేశ కీర్తిపతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వైయస్ జగన్ సోషల్ మీడియా వేదికగా భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.