తాడేపల్లి: గణనాథుని ఆశీస్సులతో వైయస్ జగన్ గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మనసారా కోరుకున్నట్లు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహానికి పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఏపీలో నెలకొన్న కరువు పరిస్థితులు పూర్తిగా తొలగిపోవాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కారణంగా ప్రజలు నానాటికీ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరిపై గణేశుడి అనుగ్రహం ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తలపెట్టే అన్ని కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని ప్రార్థించినట్లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, విజయవాడ మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.