ఆర్థిక శ్వేతపత్రం విడుదల వెనుక అనుమానాలు

ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలే ప్రధాన అంశం

వాటినే ఆర్థిక భారంగా ప్రజలకు చూపే ఉద్దేశం?

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్‌

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి. 

ఆర్థిక శ్వేతపత్రంలో లెక్కలనీ తప్పుల తడకే

ఉద్యోగులు, పెన్షనర్ల చెల్లింపులపై అసత్యాలు

ఆ మొత్తం రూ.31 వేల కోట్లు మాత్రమే

ఉద్యోగుల బకాయిలే రూ.40 వేల కోట్లు

ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడి

ఎన్నికల ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు

30 «శాతం మధ్యంతర భృతి అమలు కాలేదు

ఇప్పటి వరకు పీఆర్సీ వేయలేదు. ఐఆర్‌ లేదు

ఉద్యోగుల సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు

భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు

ప్రెస్‌మీట్‌లో ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లి: ఉద్యోగులు, పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టిన సమయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్‌సీపీ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయడం సహజమే కానీ, అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటిన తర్వాత ఉద్యోగుల జీతభత్యాలనే ఆర్థిక భారంగా  ప్రజలకు చూపించేలా శ్వేతపత్రం విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన  ప్రశ్నించారు.
    ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలకే వెళ్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.31 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తున్నారని, అందుకే వారి జీతాలను రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన భారంగా చూపించడం ఏ మాత్రం సరికాదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఉద్యోగుల హామీలన్నీ ఒట్టి మాటలే:
    ఉద్యోగులు, పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్, డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్లు తదితర రూపాల్లో భారీగా బకాయిలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీతభత్యాల కోసమే అత్యధికంగా వ్యయం చేస్తున్నామని చెబుతోంది. కానీ, నిజానికి క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే 30 శాతం ఐఆర్‌ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వెన్నుపోటు పార్టీ కూటమి, ఆ తర్వాత ఆ హామీని పూర్తిగా మర్చిపోయింది. కనీసం ఇప్పుడైనా దాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే కొత్త పీఆర్సీ నియమించాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి. ఇప్పటికే ప్రకటించిన డీఏ బకాయిలు కూడా ఆలస్యం చేయకుండా చెల్లించాలి.  

శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు:
    ఆర్థిక శ్వేతపత్రంలో పేర్కొన్న ఉద్యోగుల బకాయిల గణాంకాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనివ్వాలి. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగులకు రూ.48 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఇప్పుడు వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై క్లారిటీ ఇవ్వాలి. వాస్తవ బకాయిలు, ఇప్పటికే చెల్లించిన మొత్తాలు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మొత్తాలపై శాఖల వారీగా పూర్తి వివరాలు బయట పెట్టాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం వివిధ రూపాల్లో దాదాపు రూ.40 వేల కోట్ల మేర బకాయి పడింది. కానీ, ప్రభుత్వం వాస్తవం ఒప్పుకోకుండా, వేరే గణాంకాలు చెబుతోంది. ఇంకా గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.48 వేల కోట్ల బకాయి అన్నది పూర్తిగా అవాస్తవం. పక్కాగా లెక్కలు వేస్తే ఆ మొత్తం రూ.22 వేల కోట్లు కూడా లేదు.

ఇవన్నీ చేయాలి. లేకపోతే ఉద్యమం తప్పదు:
    ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల్లో కీలకమైన హెల్త్‌ ప్రొవిజన్‌ కమిషనర్‌ను తక్షణమే నియమించాలి. 30 శాతానికి తగ్గకుండా ఐఆర్‌ ప్రకటించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు వెంటనే విడుదల చేయాలి. జీపీఎఫ్, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్లు తదితర పెండింగ్‌ బకాయిలను చెల్లించాలి. రూ.40 వేల కోట్లకు పైగా ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోతే రెండు, మూడు దఫాల్లో అయినా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తిగా చెల్లించాలి.
    ఉద్యోగుల సహనాన్ని ప్రభుత్వం చేతకానితనంగా భావించకూడదు.  ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఇంకా పరిష్కరించకుండా ఇలాగే కాలయాపన చేస్తే భవిష్యత్తులో ఉద్యమించక తప్పదని హెచ్చరిస్తున్నాం.

Back to Top